తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకొని 8 స్థానాల నుంచి పోటీకి సిద్దమైంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారమే 8 మంది అభ్యర్ధులకు బీ-ఫార్మ్ కూడా అందజేశారు. అయితే ముందుగా వాస్తవ రాజకీయ పరిస్థితుల గురించి రెండు ముక్కలు చెప్పుకోక తప్పదు.
ఉదాహరణకు… ఖమ్మంలో బిఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీపీఐ అభ్యర్ధిగా ఎర్ర శ్రీకాంత్ బరిలో ఉన్నారు. వారు ముగ్గురితో జనసేన అభ్యర్ధి మిర్యాల రామకృష్ణ పోటీ పడి నెగ్గాల్సి ఉంటుంది. ఇది అసంభవమే.
జనసేన పోటీ చేయబోతున్న మిగిలిన 7 నియోజకవర్గాలలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. అక్కడా కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన కొమ్ములు తిరిగిన నాయకులు, ఖర్చుకు వెనకాడని బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయబోతున్నారు.
మరి పెద్దగా రాజకీయ అనుభవం, ధనబలం, పార్టీ క్యాడర్ ఏమీలేని జనసేన అభ్యర్ధులు వారిని ఏవిదంగా ఢీకొని ఓడించగలరని పవన్ కళ్యాణ్ భావించారో తెలీదు. బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారని అందరికీ తెలుసు. కానీ ఆంబోతులు పోట్లాటలో చిక్కుకొన్న లేగదూడ వంటి జనసేన అభ్యర్ధులకు బీజేపీ మద్దతు ఇస్తుందా?వారిని గెలిపించుకొనేందుకు తోడ్పడుతుందా?అంటే సమాధానం అందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్ ఇంత త్యాగానికి సిద్దపడినా తెలంగాణలో బీజేపీ గెలుస్తుందా?అంటే సర్వేలన్నీ దానికి 5-6 సీట్లు కంటే ఎక్కువ రావని తేల్చిచెప్పేశాయి. మరి బీజేపీతో జనసేన ఎందుకు పొత్తు పెట్టుకొంది?
అంటే కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయడానికే అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. వాటి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే. కనుక కాంగ్రెస్ ఓట్లను చీల్చి బిఆర్ఎస్ పార్టీకి తోడ్పడేందుకే బీజేపీ, జనసేనను బరిలో దించింది తప్ప ఎన్నికలలో గెలవాలనే ఆశ, కోరికతో కాదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కనుక రెండూ కలిసే మునగబోతున్నాయని కాంగ్రెస్ వాదిస్తోంది.
బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ఇంత త్యాగానికి సిద్దపడ్డారు కనుక మరి ఏపీలో ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తుందా?అంటే… ఒకవేళ ఆయన టిడిపిని వీడి బీజేపీతో కలిసి పనిచేసేందుకువస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆయనకు సహకరించవచ్చు.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకొంటున్నట్లు చాలాసార్లు చెప్పారు. కనుక ఆయన తన కల సాకారం చేసుకోవడానికి టిడిపిని వీడి బీజేపీతో కలిసిపోటీ చేసినా ఆశ్చర్యం లేదు. బహుశః ఈ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎదురుదెబ్బ తింటామని తెలిసున్నా బీజేపీ కోసం ఈ త్యాగానికి సిద్దపడ్డారేమో?ఒకవేళ కాదనుకొంటే ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేనలతో బీజేపీ కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ ముందే షరతు విధించి తెలంగాణలో బీజేపీతో పొత్తులకు సిద్దపడి ఉండవచ్చు.





