చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శనివారం ఉండవల్లి టిడిపి, జనసేనల తొలి జాబితా ప్రకటించగానే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం, ఆవేశంతో ఊగిపోయారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడమే వారి ఆగ్రహానికి కారణంగా కనబడుతోంది.
మరో కారణం కూడా కనబడుతోంది. టిడిపిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తదితర ముఖ్యనేతలు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో ప్రకటించుకున్నప్పటికీ, తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకపోవడం జన సైనికులకు తీవ్ర నిరాశ కలిగించడం సహజం.
అయితే వారు ఓ ఒక్క విషయం గమనించాలి. చంద్రబాబు నాయుడు ప్రతీసారి కుప్పం నుంచే పోటీ చేస్తుంటారు కనుక ఈసారి ఆయనని అక్కడే ఓడించి, రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేలా చేయాలని వైసీపి అధినేత జగన్ గత నాలుగేళ్ళుగా కుప్పంలో ఏమేమి చేస్తున్నారో జన సైనికులు కూడా చూస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన సతీమణి భువనేశ్వరి సరదాగా అన్న మాట పట్టుకొని వైసీపి ఎంత నెగెటివ్ పబ్లిసిటీ చేసిందో కూడా చూసే ఉంటారు.
కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఇప్పుడే ప్రకటిస్తే, అక్కడా వైసీపి ఇంత కంటే చాలా ఎక్కువే నష్టం కలిగిస్తుంది. వైసీపి వలన జరిగే ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకే బహుశః పవన్ కళ్యాణ్ ఈ విషయంపై గోప్యతా పాటిస్తున్నారనుకోవచ్చు.
అయితే నేడు కాకపోతే మరో 10-15 రోజులలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఎలాగూ తెలుస్తుంది. కనుక ఈ కారణంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేశపడటం మంచిది కాదు.
ఇక నుంచి జనసైనికులు వేసే ప్రతీ అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. లేకుంటే వైసీపి ఉచ్చులో చిక్కుకొంటే వారికి, వారి పార్టీకి, వారి అధినేతకు కూడా చాలా నష్టం జరుగుతుందని గుర్తుంచుకోవాలి.





