తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా ఎలర్ట్ అయినా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం తో ఊహించని షాక్ తిన్న వైకాపా నేతలు పార్టీ అధినేతకు ఎదురు చెప్పలేక, నమ్ముకున్న కార్యకర్తలకు సర్ది చెప్పలేక అయోమయంలో పడుతున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా కొందరు ‘రాజకీయ సన్యాసానికి’ మొగ్గుచూపుతుంటే మరికొందరు ‘పార్టీ గోడ దూకే ప్రయత్నాలు’ షురూ చేస్తున్నారు.’బెదిరిస్తూ’ కొందరు, ‘ప్రాధేయపడుతూ’ కొందరు, ‘నిరసన’ తెలుపుతూ కొందరు,’త్యాగాలకు’ సిద్ధమంటూ ఇంకొందరు ఇలా తలోదిక్కుగా జగన్ రాజకీయ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రాజకీయ సన్యాసం:
గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తానూ రాజకీయాలనుండి తప్పుకుంటున్నా అంటూ ప్రకటన చేసారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇమడలేకపోతున్నానంటూ తన ఆవేదనను వ్యక్త పరిచారు.గడిచిన వారం రోజుల కిందట కూడా మరో వైసీపీ నేత వసంత కృష్ణ మోహన్ కూడా ఇదే ప్రకటన చేశారు.తమ ఆవేదనను పార్టీ పెద్దలు పట్టించుకోక పోవడమే ఇటువంటి ప్రకటనలకు కారణాలుగా చెపుతున్నారు రాజకీయ సన్యాసం ప్రకటించిన నేతలు. బాలినేని కూడా జగన్ వైఖరి పట్ల తన ఆవేదనను పలు సందర్భాలలో బహిరంగానే వ్యక్త పరిచారు.
పార్టీకి రాజీనామా,పక్క పార్టీల వైపు చూపులు:
జగన్ కు నమ్మిన బంటుగా చెప్పబడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగిందంటూ పుకార్లు షికార్లు చేశాయి.జగన్ నిర్ణయంతో పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి తమ రాజకీయ భవిష్యత్ కు పక్క పార్టీల వైపు గోడ దూకే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరికొందరు వైసీపీ నాయకులు.వీరిలో కోటం రెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలో తమ రాజకీయం మొదలుపెట్టారు.
తాజాగా మరికొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన జెండాలు కప్పుకుంటూ జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
బెదిరింపులు:
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2024 లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తానూ తిరిగి ఫ్యాక్షన్ బాట పడతాను,శత్రువులను వదిలిపెట్టను, మరో నాలుగు నెలల నా నిజ స్వరూపం చూపిస్తాను అంటూ బెదిరింపు ధోరణిలోకి వచ్చేసారు. ఇంతకీ తానూ బెదిరించే ప్రత్యర్థి సొంత పార్టీ వారేనా..?అంటూ పెద్దారెడ్డి కి ప్రతిపక్షాల నుండి పెద్ద ప్రశ్నే ఎదురయ్యింది.
త్యాగాలు:
అలాగే తమకు జగన్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా, స్థాన చలనం కల్పించినా జగన్ వెంటే నడుస్తాం అంటూ ఇప్పటికే జోగి, రోజా, అంబటి,గుడ్డు మంత్రి అమర్నాధ్ ప్రకటించగా తాజాగా ఆ లిస్టులోకి హోమ్ మంత్రి తానేటి వనితా వచ్చి చేరారు. తానూ కొవ్వూరు నుంచే పోటీ చేయాలనుకుంటున్నా అంటూనే ఒకేవేళ జగన్ తన స్థానాన్ని వేరొకరికి ఇచ్చినా అందుకు నేను సిద్ధంగా ఉంటానంటూ త్యాగానికి సిద్ద పడ్డారు.
నిరసన:
తాడేపల్లి వైసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన బాట పట్టారు నర్సారావు పేట వైసీపీ నేతలు. నర్సారావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకుంటాం అంటూ పార్టీకి, పార్టీ అధినేతకు తమ నిరసన తెలియచేసారు. అలాగే సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదిమూలపు సురేష్, సుధాకర్,మేరుగు నాగార్జున వంటి వారితో విజయ సాయి చర్చలు జరిపి పార్టీ నిర్ణయానికి కట్టుబడి, విభేదాలు మరిచి అందరు కలిసి కట్టుగా పార్టీ విజయానికి కష్టపడాలంటూ సూచనలు చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా వైసీపీ పార్టీలో జరుగుతున్నా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న ఏపీ ప్రజలకు అసలు వైసీపీ పార్టీలో ఎం జరుగుతుంది.?ఆ పార్టీ నాయకులు ఏం చెపుతున్నారు.?అనే సందేహాలు మొదలయ్యాయి.




