ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మొన్న నెల్లూరులో విలేఖరులతో మాట్లాడుతూ “ఆంధ్రాలో జనసేనతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని” చెప్పారు. కానీ ఆమె వైసీపి ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలలో జనసేన ఎక్కడా కనిపించడం లేదు. ఆమె కూడా జనసేను కలుపుకుపోయేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. వైసీపి మద్యం కుంభకోణంపై ఆమె ఒంటరి పోరాటమే చేశారు. ఇప్పుడు వైసీపి ఇసుక దోపిడీపై కూడా ఒంటరి పోరాటమే చేస్తున్నారు.
మరోపక్క టిడిపి, జనసేనలు ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకొంటూ కలిసికట్టుగా వైసీపి ప్రభుత్వంతో పోరాటాలు చేస్తున్నాయి. తాజాగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ’ పేరుతో ఏపీలో గుంతలు పడిన రోడ్ల పరిస్థితిని తెలియజేస్తూ అవి చేస్తున్న పోరాటలే ఇందుకు నిదర్శనం.
తెలంగాణలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయగలుగుతున్నప్పుడు, ఏపీలో రెండు పార్టీల మద్య పొత్తులు ఉన్నప్పటికీ ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నాయి?అంటే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకోవడమే అందుకు కారణం అని సర్ధిచెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే, ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోక మునుపు కూడా ఏపీలో బీజేపీ, జనసేనలు కలిసి పనిచేయలేదు కనుక.
మరైతే ఏపీలో బీజేపీ, జనసేనలు ఇంకా ఎప్పుడు కలిసి పనిచేస్తాయి?అంటే ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అని దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చెప్పేశారు. టిడిపితో పొత్తుల సంగతి తేలితే కానీ ఏపీలో బీజేపీ, జనసేనలు కలిసి పనిచేయలేవని అర్దమవుతోయింది.
మరైతే ఏపీలో పొత్తులు సంగతి తేలేదెప్పుడు?అంటే బహుశః తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అని అనుకోవచ్చు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడితే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టమైపోతుంది. ఆ లెక్కన ఏపీలో టిడిపి, జనసేనలతో కలిసి పోటీ చేయాలా లేక ఒంటరిగా పోటీ చేస్తూ పరోక్షంగా వైసీపిని గెలిపించేందుకు తోడ్పడాలా?అని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకోవచ్చు.






