2019 సార్వత్రిక ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఖచ్చితంగా పోటీ చేస్తానని బల్లగుద్ది చెప్తోన్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేసేసారా? అంటే మొత్తానికి కాకపోయినా, కొంత పునాదులు అయితే వేసారని ‘జనసేన’ అధికార ప్రతినిధిగా చలామణి అవుతోన్న సుంకర కళ్యాణ్ దిలీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలను బట్టి అర్ధమవుతోంది.
[m9ad]
మరో ఒకటి, రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ నుండి వెలువడనున్న ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపే అవకాశం ఉందనేది ఈ వ్యాఖ్యల సారాంశం. దాదాపుగా 25 మంది ప్రముఖులతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారని, వారంతా ‘జనసేన’లో అత్యంత కీలకపాత్ర పోషించబోతున్నారని, ఆ పేర్లు స్వయంగా పవన్ కళ్యాణే బయట పెడతారని దిలీప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏ విషయాన్నైనా దాచిపెట్టి ముందుకు వెళ్ళడం పవన్ ఉద్దేశం కాదని, కానీ సమయం, సందర్భం చూసుకుని అన్నీ విషయాలు పవనే చెప్తారని అన్న దిలీప్, మూడేళ్ళ క్రితమే జనసేన నియామకాలు జరిగాయని తెలంగాణకు ఇన్ చార్జ్ గా శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, మీడియా హెడ్ గా హరిప్రసాద్ ఉన్నారని చెప్పారు. మరో నెల రోజుల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటవుతుందని అన్నారు.



