ఆంధ్రావాళ్ళు పరిశ్రమలు, పెట్టుబడులు పెడుతుంటే…

Who Loots Telangana

“తెలంగాణ రాష్ట్రంపై పెత్తనం చేస్తూ దోచుకునేందుకు ఆంధ్రా పార్టీలు, నాయకులు వస్తున్నారని” బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు ఆరోపించని రోజు లేదు.

అయితే తెలంగాణని ఎవరు దోచుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే ‘కాంగ్రెస్‌ నేతలని’ బీఆర్ఎస్‌ పార్టీ, ‘బీఆర్ఎస్‌ పార్టీ నేతలని’ కాంగ్రెస్‌ పార్టీ నిత్యం ఆరోపించుకుంటూనే ఉంటాయి.

ADVERTISEMENT

అంతేకాదు… “కేసీఆర్‌ హయంలో భారీగా అవినీతి జరిగిందని,. హరీష్‌ రావు, గంగుల కమలాకర్ వంటిపలువు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు వందల ఎకరాల కబ్జాలు చేసి ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారని” కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

తండ్రి పేరు, తెలంగాణ జాగృతి పేరు చెప్పుకొని ఆమె కూడా బాగానే దండుకున్నారని, కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తూనే ఉంటారు.

నాడు కేసీఆర్‌ అవినీతి సొమ్ము వెదజల్లి దేశమంతా బీఆర్ఎస్‌ పార్టీని విస్తరించాలనుకుంటే, నేడు అయన కూతురు కూడా ఆ డబ్బుతోనే పార్టీ పెట్టుకొని నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.

కనుక మొత్తంగా చూస్తే తెలంగాణని బయటవారు ఎవరూ దోచుకోవడం లేదని తెలంగాణకు శ్రీరామరక్ష లేదా ధర్మకర్తలమని చెప్పుకునేవారే దోచుకుంటున్నారని వారి మాటలతోనే అర్ధమవుతోంది.

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదన్నట్లు తెలంగాణ ప్రభుత్వంలో మల్టీ జోన్-2 సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల కార్యాలయంలో ఉప సంచాలకుడుగా పనిచేస్తున్న నరహరి వంటి అవినీతి అధికారులు కూడా అందినకాడికి భోం చేసేస్తూనే ఉన్నారు.

ఇటీవల పాతబస్తీలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయాగా అయన పడుకునే పరుపు కింద కోట్ల రూపాయలు పేర్చి ఉన్నాయి. అటకెక్కించేసి మీద మరికొన్ని కోట్లు మూటలు కట్టి పెట్టారు. సుమారు వంద కోట్లు విలువైన స్థిరాస్తి పత్రాలు, భారీగా వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

నేడు ఏసీబీ అధికారులు అయన బ్యాంక్ లాకర్ బద్దలు కొట్టి చూడగా దానిలో కోటిన్నర నగదు, ఏకంగా రెండున్నర కేజీల బంగారం కనిపించింది. అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి వందల కోట్లు పోగేసుకోవడం చూస్తున్నప్పుడు తెలంగాణలో దోపిడీ ఎంతగా జరుగుతోందో ఊహించుకోవచ్చు.

గమ్మతైన విషయం ఏమిటంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ వందలు, వేలకోట్ల పెట్టుబడితో సినిమాలు తీస్తూ, అనేక వేలమందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తోంది. ఆంధ్రా నాయకుల పరిశ్రమలు, సినీ పరిశ్రమ వలన తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది కూడా.

“మీకు అమరావతి ఉందిగా హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నారు? వైద్య చికిత్సల కొరకు హైదరాబాద్‌కి ఎందుకు వస్తున్నారు?” అంటూ కల్వకుంట్ల కవిత వంటివారు వెటకారంగా అడుగుతుంటారు.

కానీ ఆంధ్రా నేతలకు హైదరాబాద్‌లో భారీగా స్థిరాస్తులున్నందునే వస్తున్నారు. కనుక వాటి నుంచి, వారు చేసే ఖర్చుల నుంచి, వారి వాహనాల నుంచి పన్నుల రూపంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అదేవిధంగా హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే తెలంగాణకే ఆదాయం సమకూరుతుంది. కనుక ఆంధ్రా నాయకులు, సినీ ప్రముఖుల వలన తెలంగాణకు ఎంతో కొంత మేలే జరుగుతోంది తప్ప కీడు జరుగడం లేదనే విషయం కల్వకుంట్ల కవిత వంటివారికి తెలియకనే మాట్లాడుతున్నారని అనుకోలేము.

కనుక తెలంగాణని దోచుకుంటున్నవారు ఎవరో, తెలంగాణకు మేలు చేస్తున్నవారు ఎవరో తెలంగాణ ప్రజలే గుర్తించాలి.

ADVERTISEMENT
Latest Stories