వీర్రాజుగారు… కుర్చీని ఎవరికి అప్పగిస్తారు?

Somu Veerrajuత్వరలో ఏపీ, తెలంగాణలతో సహా పలు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బండి సంజయ్‌ స్థానంలో కిషన్ రెడ్డి పగ్గాలు చేపడతారని వార్తలు వస్తుంటే, ఏపీలో సోమూ వీర్రాజు స్థానంలో బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ యాదవ్‌ పేరు వినిపిస్తోంది.

కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కూడా తెచ్చుకొన్నారు కనుక ఆయన పేరు కూడా వినబడుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి పేరు కూడా వినబడుతోంది కానీ ఆమెకు పార్టీ పగ్గాలు ఇచ్చే ఆలోచన ఉంటే మూడేళ్ళ క్రితమే ఇచ్చి ఉండేవారు కదా?కనుక ఆమెకు అవకాశం ఉండకపోవచ్చు. అయితే త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల మార్పు మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.

ADVERTISEMENT

అయితే జాతీయ స్థాయిలో బిజేపీ భవిష్యత్‌ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను లెక్కకట్టుకొనే ఏపీలో బిజెపి అనే పావును కదుపుతుంది తప్ప ఏపీలో బిజెపి అధికారంలోకి రావాలనో లేదా వైసీపీని ఢీకొని ప్రత్యామ్నాయంగా ఎదగాలనో కాదనే చెప్పొచ్చు. కనుక బిజెపి అధిష్టానం ఈ ఆలోచనలో మార్పురానప్పుడు ఏపీ బిజెపికి ఎవరిని అధ్యక్షుడుగా నియమించినా పెద్ద తేడా ఏమీ ఉండదనే భావించవచ్చు.

అయితే సోమూ వీర్రాజు జనసేనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు కనుక ఆయన స్థానంలో సత్యకుమార్ యాదవ్‌ పగ్గాలు చేపడితే, రెండు పార్టీల మద్య సఖ్యత ఏర్పడి కలిసి పనిచేసేందుకు మార్గం సుగమం కావాచ్చు.

ఒకవేళ టిడిపిని కలుపుకోవాలన్నా సత్యకుమార్ యాదవ్‌ ఉంటేనే సాధ్యం అవుతుందనేది అందరికీ తెలిసిందే. అలాకాక సోమూ వీర్రాజునే కొనసాగిస్తే, ఎప్పటిలాగే మూడడుగులు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు ఏపీ బిజెపి సాగవచ్చు.

బహుశః వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల మార్పుపై స్పష్టత రావచ్చు. వస్తే ఏపీ, తెలంగాణల విషయంలో బిజెపి అధిష్టానం వైఖరిపై కూడా కొంత స్పష్ఠత ఏర్పడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories