నాడు బీఆర్ఎస్‌ ప్రయోగించిన ఆ అస్త్రమే నేడు…

Why BRS Faces a Tough Bypoll Battle in Hyderabad

ఉప ఎన్నికలలో సర్వసాధారణంగా అధికార పార్టీ గెలుస్తుంటుంది. కానీ హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ గెలవాలని చాలా పట్టుదలగా ఉంది. అందుకు కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ చనిపోవడం వలన ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. కనుక దీనిని తిరిగి దక్కించుకోకపోతే, వరుస ఓటములతో చతికిలపడిన గులాబీ పార్టీ పరువు పూర్తిగా పోతుంది.

ADVERTISEMENT

ఇంత చిన్న ఉప ఎన్నికలో పార్టీని గెలిపించుకోలేకపోతే కేటీఆర్‌ నాయకత్వంపై పార్టీ శ్రేణులకు నమ్మకం సడలుతుంది. పార్టీ నాయకత్వం హరీష్ రావుకు అప్పగించాలనే డిమాండ్ మళ్ళీ తెరపైకి వస్తుంది. అప్పుడు కాంగ్రెస్‌, బీజేపిలు తప్పకుండా హరీష్ రావుని ప్రోత్సహించి బీఆర్ఎస్‌ పార్టీని నిలువునా చీల్చవచ్చు లేదా ఆయననే తమ పార్టీలోకి ఆకర్షింఛి బీఆర్ఎస్‌ పార్టీని చావు దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్‌ పార్టీకి ఇలాంటి కారణాలు ఇంకా అనేకం ఉండవచ్చు. కానీ ఆ కారణాలతో ఓటర్లకు పని లేదు!

2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులను చావు దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్‌ పార్టీ ఓ దుష్ప్రచారం జోరుగా చేసేది. వారిని గెలిపించినా తర్వాత ఎలాగూ మా బీఆర్ఎస్‌ పార్టీలోనే చేరిపోతారు. కనుక వారికి వేసే ప్రతీ ఓటు వృధాయే. అదేదో బీఆర్ఎస్‌ పార్టీకే వేస్తే మీ నియోజకవర్గాలను మరింత అభివృద్ధి చేస్తారంటూ ప్రచారం చేసేది.

ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపి రెండూ సరిగ్గా అదే అస్త్రాన్ని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ మీద ప్రయోగిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌, కేంద్రంలో బీజేపి అధికారంలో ఉన్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ దయనీయంగా ఉంది. కనుక దానికి ఓట్లు వేసి గెలిపించినా ప్రజలకు ఏమీ చేయలేదు. ఒకవేళ మాగంటి సునీత గెలిచినా కాంగ్రెస్‌ లేదా బీజేపిలో చేరిపోవచ్చు.

కనుక ఆమెను గెలిపిస్తే ఆమె, బీఆర్ఎస్‌ పార్టీ మాత్రమే లాభపడతాయి తప్ప ఓటర్లు కారు. కనుక మా పార్టీ అభ్యర్ధులకే ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్‌ నేతలు, తెలంగాణ బీజేపి నేతలు జూబ్లీహిల్స్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది ఓటర్లను బాగా ఆలోచింపజేసే విజయవంతమైన టెక్నిక్. పైగా ఇదే వాస్తవం. కనుక ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ గెలుపు చాలా కష్టమే. కనుక మరింతగా ఎదురీత తప్పదు.

ADVERTISEMENT
Latest Stories