మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో అత్యంత విలాసవంతంగా విశాఖలోని ఋషికొండపై నిర్మించిన ప్యాలస్‌లపై కూటమి ప్రభుత్వం రెండేళ్ళయినా నిర్ణయం తీసుకోలేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
ఓ ముఖ్యమంత్రి తన నివాసం కొరకు అన్ని వందల కోట్ల ప్రజాధనం దుబారా చేయడం చాలా తప్పని అందరూ అంగీకరిస్తారు. వాటి నిర్వహణ కొరకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
ఈ రెండేళ్లలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్ళి వాటిని పరిశీలించారు. వాటిని ఏవిధంగా వినియోగించుకోవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతుండటంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. వారు పర్యాటక రంగంలో ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరిపారు.
కానీ రెండేళ్ళు గడిచినా ఇంతవరకు రుషికొండ ప్యాలస్‌లు ఏవిధంగా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డీఎస్పీవీ స్వామి తదితరులు మళ్ళీ అక్కడికి వెళ్లి భవనాలను పరిశీలించడంతో కూటమి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కానీ ఇంకా అదే సందిగ్ధంలో ఉన్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వమే విమర్శలు ఎదుర్కోవలసివస్తుంది.
తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని అప్రదిష్టపాలు చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే వైసీపీ విమర్శిస్తోంది. మంత్రుల పర్యటనలు, పరిశీలనలు తప్ప ఈ అంశంపై కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోవడం చాతకానితనమేనని వైసీపీ విమర్శించినా ఆశ్చర్యం లేదు.
కనుక రుషికొండ ప్యాలస్‌లపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఇలాగే మరో మూడేళ్ళు కాలక్షేపం చేస్తే ఈ 5 ఏళ్ళలో వాటి నిర్వహణ ఖర్చులకు తోడు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలకు, వారి సమావేశాలకు చేసే ఖర్చులు కూడా ప్రజాధనం వృధా పద్దులో వ్రాసుకోవాల్సి వస్తుంది.




