ఇండియా కూటమి కాలక్షేప సమావేశాలు… ఏం ప్రయోజనం?

Why Is the INDIA Alliance Still Struggling Against BJP?

కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల అధినేతలు నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. దీనిలో పాల్గొన్నవారందరూ కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులే. తమతమ రాష్ట్రాలలో రాజకీయాలను శాశిస్తున్నవారే. ఇంతమంది ఉద్దండులు ఒకచోట చేరి దేశ భవిష్యత్‌ గురించి ఆలోచన చేసే ఉంటారు. కానీ ఆ భవిష్యత్‌లో తమ తమ భవిష్యత్‌ కూడా వెతుక్కుంటారు.

వారి అందరి అజెండా ఒక్కటే. కేంద్రంలో మోడీని, రాష్ట్రాలలో బిజేపిని గద్దె దించి తాము అధికారంలోకి రావడమే. కానీ దాని కోసం వారి వద్ద నిర్దిష్టమైన కార్యాచరణ ఏమీ ఉండదు.

ADVERTISEMENT

ఆనవాయితీ ప్రకారం ముందుగా బిజేపి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్దమైన పాలన గురించి మాట్లాడుకుంటారు. తర్వాత హిందూ మతం పేరుతో బిజేపి ఏవిధంగా దేశాన్ని భ్రష్టు పట్టించేస్తోందో కాసేపు మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచేసి సామాన్యుడిని పీడిస్తుండటం, రూపాయి విలువ పతనం, అంబానీ, ఆదానీలకు దేశాన్ని దోచిపెట్టేసి ఇస్తుండటం వంటి కామన్ అండ్ రొటీన్ అంశాలపై అందరూ అనర్గళంగా మాట్లాడుతారు.

ఆ తర్వాత బిజేపి చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ వంటివారు బిజేపి దాష్టికాల గురించి చెప్పుకొస్తే అందరూ సంఘీభావం ప్రకటిస్తారు. ఈసారి పార్లమెంట్ సమావేశాలలోమోడీ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలని చర్చించడంతో సమావేశం ముగుస్తుంది.

ఇలాంటి సమావేశాలు ఇండియా కూటమి పార్టీలకు కాలక్షేపానికి తప్ప వేరే ఉపయోగం ఉండదు. కనుక ఇలాంటివి మరో డజను పెట్టుకున్నా బిజేపికి, ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఎటువంటి అభ్యంతరం ఉండబోదు.

ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ చేసుకోవడం ఎంత అవసరమో, అదేవిధంగా ఇండియా కూటమి కూడా తాము బిజేపిని మోడీ, అమిత్ షాలను ఎందుకు నిలువరించలేకపోతున్నామని గట్టిగా ఆలోచించడం అంతే అవసరం. కానీ అలాంటి ఆలోచన చేయకుండా ఇలాంటి సమావేశాలతో కాలక్షేపం చేస్తుంటాయి.

ఇటీవల తమిళనాడులో డీఎంకేపార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ టీవీకే పార్టీతో చేతులు కలిపింది. అ కారణంగా డీఎంకే కాంగ్రెస్‌ పార్టీతో, ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకుంది. కనుక దీనిపై కూటమిలో పార్టీలు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని గట్టిగా నిలదీయాలి. కానీ నిలదీయవు.

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని చేయడమే మా లక్ష్యం అని కాంగ్రెస్‌ నేతలు అంటుంటే ఇండియా కూటమి నేతలు కూడా అంగీకరిస్తూ ప్రకటనలు చేసినా బాగుండేది. కానీ ఎవరూ అంగీకారం తెలుపరు. అలాగని ఖండించరు. మౌనంగా ఉండి పోతారు.

నేటికీ ఈ విషయంలో వారికి ఏకాభిప్రాయం లేనప్పుడు, పరస్పర నమ్మకం లేనప్పుడు ప్రజలు మనల్ని ఎందుకు నమ్మాలి? అని ఒకసారి ఆలోచిస్తే ఇండియా కూటమి బిజేపిని ఎందుకు నిలువరించలేకపోతోంది వారికే అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories