పవన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నా వైసీపీ నమ్మదేమిటో?

Pawan Kalyanజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఈసారి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇమ్మనమని, ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పదేపదే చెపుతున్నారు. పవన్‌ నోట ఆ మాట విని ఆయన అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన మాటలను నమ్మడం లేదు!

చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకే ఆయన తిరుగుతున్నారంటూ వాదిస్తున్నారు. ఆ లెక్కన పవన్‌ కళ్యాణ్‌ “జనసేన-టిడిపిలు పొత్తులు పెట్టుకొంటున్నాయి. టిడిపితో కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. కనుక మా కూటమికే ఓట్లు వేసి గెలిపించమని” ప్రజలను అడగాలి.

ADVERTISEMENT

కానీ ఆయన ‘జనసేనకు మాత్రమే’ ఓట్లు వేయమని అడుగుతున్నారు. పైగా ఈసారి గోదావరి జిల్లాలలో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కనీయవద్దని ప్రత్యేకంగా చెపుతున్నారు. గోదావరి జిల్లాలలో జనసేనకు మంచి పట్టున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన అక్కడే ఇన్ని రోజులు పర్యటిస్తూ జనసేన బలం పెంచుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలలో అన్ని సీట్లను జనసేన సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

అయితే దీనిపై టిడిపి నుంచి ఎటువంటి వ్యాఖ్యలు, ఖండనలు, అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే టిడిపి, జనసేనలు ఎవరిదారి వారిదే అని భావిస్తున్నట్లు అనుకోవలసి ఉంటుంది. కానీ టిడిపి, జనసేనలు తప్పకుండా పొత్తులు పెట్టుకొంటాయని ఆ రెండు పార్టీల కంటే వైసీపీయే బలంగా నమ్ముతోంది. అందుకే నేటికీ టిడిపి కోసమే పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర చేస్తున్నారని గట్టిగా వాదిస్తోంది.

మొదట పవన్‌ కళ్యాణ్‌ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలని కలిసి వచ్చిన తర్వాతే ఈ మూడు పార్టీల మద్య ఏదో జరుగుతోందని వైసీపీ అనుమానిస్తోంది. దాని అనుమానాలు నిజం కావచ్చు కూడా.

అయితే పవన్‌ కళ్యాణ్‌ ఈవిదంగా చొచ్చుకుపోయి ‘జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తా… నేను ముఖ్యమంత్రినవుతా’ అని గట్టిగా నొక్కి చెప్పిన తర్వాత ఆ మాటను వెనక్కు తీసుకొని టిడిపితో పొత్తులకు సిద్దపడితే, అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా?మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము పవన్‌ కళ్యాణ్‌ టిడిపి కోసమే పనిచేస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తారు కదా?

పవన్‌ కళ్యాణ్‌ ప్రజలను మోసం చేశారని, ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేశారని వైసీపీ వాదించడం ఖాయం. దాని వలన జనసేనకు కోలుకోలేని దెబ్బ తగలవచ్చు. దాంతో బాటు టిడిపి విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కనుక టిడిపి-జనసేన లేదా జనసేన-బిజెపి లేదా టిడిపి-జనసేన-బిజెపిల బంధం గురించి వీలైనంత త్వరగా ప్రజలకు స్పష్టత ఇవ్వడమే మంచిది.

ADVERTISEMENT
Latest Stories