జనసేన పార్టీకి మెగా బ్రదర్ నాగబాబు, హీరో వరుణ్ తేజ్ భారీ విరాళాన్ని ఇచ్చారు. నాగబాబు రూ.25లక్షలు.. వరుణ్ తేజ్ రూ.కోటి ఫండ్‌గా ప్రకటించారు. వరుణ్ తేజ్ తరువాత బన్నీ, రామ్ చరణ్ కూడా భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించే అవకాశం ఉందట. మరోవైపు త్వరలో చిరంజీవి కూడా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీలో చేరిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీకి భారీ విరాళం ఇవ్వబోతున్నారని సమాచారం. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
[m9ad]
రాజ్యసభ సభ్యత్వం ఉన్నంతవరకు అప్పుడప్పుడైనా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే వారు ఆ తరువాత మాత్రం పూర్తిగా దూరం అయిపోయారు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో కూడా చిరంజీవి ప్రచారం చెయ్యలేదు. దీనితో ఆయన కాంగ్రెస్ ను వీడి పోవడం ఖాయమని తేలిపోయింది. ఇక జనసేనలో చేరటం లాంఛనమే అని సమాచారం. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్ పార్టీ మీద పడకుండా కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు.
అనేక సందర్భాలలో తాను దైవంగా భావించే అన్నను సైతం ఎదిరించి పార్టీ పెట్టాను అని తరచూ చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్. అయితే చాలా సార్లు ప్రజారాజ్యం విషయంలో అన్నయ్య తప్పేమీ లేదని చుట్టూ ఉండేవారు మోసం చేశారు వారిపై పగ తీర్చుకుంటా అన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో అన్నయ్యను తిరిగి తెరమీదకు తీసుకువచ్చే అవకాశం ఉందట. అయితే ఈ పరిణామం దేనికి దారి తీస్తుందో చూడాలి. చిరంజీవి రాజకీయాలకు దూరమైన తరువాత ఖైదీ నెం 150తో భారీ హిట్ కొట్టారు.
ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సైరా చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. 2019 దసరాకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తొందర్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. అవసరమైతే సినిమాకు బ్రేక్ ఇచ్చి జనసేనకు ప్రచారం చేయనున్నారని సమాచారం. ఇదే సమయంలో ఆయన జనసేన నుండి పోటీ చెయ్యరని ఎన్నికల తరువాత ఆయనకు ఏదైనా సముచిత గౌరవం కలిపిస్తారని సమాచారం.



