ఈ నేపధ్యంలో జగన్ సొంత సర్వేలు, ఐప్యాక్ సర్వేలు, మీడియా సర్వేలను క్రోడీకరించి చూస్తే కనీసం 20-30 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు సరే… మరి మంత్రుల మాటేమిటి? అంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి కొందరు సీనియర్లు పార్టీ పరిస్థితి ముందే పసిగట్టారో లేక వారసులకు అవకాశం కల్పించాలనుకొన్నారో తెలీదు కానీ ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం లేదని ముందే చెప్పేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని, వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ వంటి మరికొందరు సీనియర్లు కూడా ఈసారి పోటీకి దూరం అంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు , పార్టీ కార్యక్రమాల గురించి చెప్పుకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లని ఎద్దేవా చేస్తూ కాలక్షేపం చేస్తున్న ఓ మహిళా మంత్రితో సహా మరో ఇద్దరు మంత్రులకి ఈసారి జగన్ టికెట్ ఇస్తారో లేదో అనుమానమే. పైగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం నియోజకవర్గంలో జరిగే పార్టీ లేదా అధికార కార్యక్రమాలప్పుడు బయటపడుతూనే ఉంది.
ఇక అత్యుత్సాహంతో తెలంగాణ సిఎం కేసీఆర్‌పై నోరుజారిన మంత్రి సీదిరి అప్పలరాజుకి టికెట్ డౌటే అనిపిస్తోంది. పనితీరుని బట్టి మరో 5-6 మంత్రులకి, వారిలో ఇద్దరు మహిళా మంత్రులని ఈసారి ఎన్నికలలో జగన్ పక్కనపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
అయినా ఈసారి 175/25 సీట్లు మాకే అని ఏపీ సిఎం జగన్ పదేపదే చెప్పుకొంటున్నారు. అయితే పార్టీలో ఒకరిద్దరు మాత్రమే ఆ మాట గట్టిగా చెప్పుతున్నారు. మిగిలిన వారందరూ మాకెందుకు అన్నట్లు వేరే విషయాల గురించి మాట్లాడుతున్నారు. అంటే తమ అధినేత కాకి లెక్కలని అందరూ నమ్మడం లేదన్నమాట!






