ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళల గౌరవం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయాలకు దూరంగా ఉండే వారి ఇళ్ళలోని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేవారు.
శాసనసభలో, మీడియా ముందుకు వచ్చినప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ తమ మాటకారితనానికి పొంగిపోయేవారు. కానీ అదే వైసీపీ కొంప ముంచిందని గ్రహించేసరికి చాలా ఆలస్యమైంది. కానీ నేటికీ వారి తీరులో ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం.
హోం మంత్రి అనిత వంగలపూడి గురించి గుడివాడ అమర్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసి, తనకు మహిళలంటే చాలా గౌరవమని చెప్పుకుంటూనే, ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శనం.
ఆమెతో సహా పలువురు మంత్రులు, టీడీపి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి సతీమణి, తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా? అని గుడివాడ అమర్‌నాథ్ ఎదురు ప్రశ్నించడం తన తప్పుని సమర్ధించుకున్నట్లే ఉంది తప్ప మహిళల పట్ల గౌరవభావం ఉందని నిరూపించుకున్నట్లు లేదు.
మహిళల గురించి అనుచితంగా మాట్లాడితే వైసీపీని క్షమించని ప్రజలు, ఒకవేళ టీడీపి నేతలు కూడా అదేవిధంగా మాట్లాడితే క్షమిస్తారా? అని ఆలోచిస్తే గుడివాడ అమర్‌నాథ్ తప్పుని సమర్ధించుకునే ప్రయత్నం చేయరు.
కానీ వైసీపీ సోషల్ మీడియా కూడా ఆయనని సమర్ధిస్తూ టీడీపిపై ఎదురు దాడి చేస్తోంది. ‘రప్పా రప్పా’ తప్పు కాదనుకున్నవారికి ఇదీ పెద్ద తప్పుగా అనిపించకపోవడం ఆశ్చర్యం కాదు.




