2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేయగా, వైసీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకటరావు పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ గెలిచి ఉంటే నేడు ఆయన వైసీపీలో, వంశీ టిడిపిలోనే ఉండి ఉండేవారేమో?
ఆ తర్వాత స్నేహితుడు కొడాలి నాని ప్రోత్సాహంతో వంశీ టిడిపిలో నుంచి వైసీపీలో మారడంతో యార్లగడ్డకు క్రమంగా పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అయినప్పటికీ ఇంతకాలం సంయమనం పాటిస్తూ వైసీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ గన్నవరం టికెట్ అడిగితే “పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పోవచ్చని” సజ్జల రామకృష్ణారెడ్డి నిర్మొహమాటంగా చెప్పారు.
దానిని అవమానంగా భావించిన యార్లగడ్డ వెంటనే హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసి నేడు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. తనకు గన్నవరం టికెట్ ఇవ్వాలనే షరతుతోనే ఆయన టిడిపిలో చేరారు కనుక చంద్రబాబు నాయుడు ఆయనకు గన్నవరం టికెట్ ఖరారు చేసినట్లే భావించవచ్చు.
దీంతో మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా యార్లగడ్డ, వంశీ గన్నవరం నుంచే తలపడబోతున్నారు. అయితే ఈసారి వంశీ వైసీపీ తరపున, యార్లగడ్డ టిడిపి తరపున బరిలో దిగబోతున్నారు… అంతే తేడా.
గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో కూడా వంశీ గన్నవరం నుంచి గెలిచారంటే, ఆ నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉన్నట్లు అర్దమవుతోంది. అయితే ఆయన బలం టిడిపి, దాని కార్యకర్తలే. ఆయనతోపాటు కొంతమంది అనుచరులు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినా నేటికీ గన్నవరంలో టిడిపి క్యాడర్ చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
వంశీ అనుచరులు గన్నవరంలో టిడిపి కార్యాలయంపై దాడులు చేయడమే కూడా అందుకే. లేకుంటే తనకు రాజకీయ భిక్షపెట్టిన టిడిపి కార్యాలయంపై దాడులు చేసి ఉండేవారు కారు.
ఇక వర్తమానానికి వస్తే, గన్నవరంలో వంశీ స్థానాన్నిని, ఆయనతో కలిసి వైసీపీలోకి వెళ్ళిపోయిన టిడిపి కార్యకర్తల స్థానాన్ని ఇప్పుడు యార్లగడ్డ, ఆయన అనుచరులు భర్తీ చేశారు. తాజా చేరికలతో గన్నవరంలో టిడిపి, వైసీపీల బలాబలాలు మారాయి. కనుక అది చాటిచెప్పేందుకు మంగళవారం నారా లోకేష్ బహిరంగసభ వేదిక కాబోతోంది.
ఈ సభకు కనీసం లక్షమందితో నిర్వహించాలని టిడిపి నేతలు భావిస్తే, మరో లక్షమందిని సమీకరించి తన సత్తా చాటుకొనేందుకు యార్లగడ్డ వెంకటరావు గట్టిగా కృషి చేస్తున్నారు.
ఇక మరోవిషయం ఏమిటంటే యార్లగడ్డ ఇంతకాలం వైసీపీలో ఉన్నందునే వంశీ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నా మెతకవైఖరితో మసులవలసి వచ్చింది. కానీ వంశీ చేతిలో ఓటమి ప్రతీకారం తీర్చుకోవలసి ఉంది. వంశీ కారణంగానే పార్టీలో అవమానాలు భరించారు. చివరికి అవమానకరంగా పార్టీని వీడవలసివచ్చింది. కనుక వచ్చే ఎన్నికలలో వంశీని ఢీకొని ఓడించాలని యార్లగడ్డ చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక ఇక నుంచి వంశీని ధీటుగా ఎదుర్కోవడం ఖాయమే… దాంతో ఇక నుంచి గన్నవరంలో యార్లగడ్డ, వల్లభనేనీ వంశీల మద్య యుద్ధం కూడా అనివార్యమే. అది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.



