వైసీపీ ఉచ్చులో చంద్రబాబు నాయుడు చిక్కుకోవడం లేదే!

CBN's Kuppam Projectఒక అబద్దాన్ని వందసార్లు గట్టిగా చెపితే అదే చివరికి నిజమైపోతుందన్న ఫార్ములాను వైసీపీ బాగానే ఆకళింపు చేసుకొని, చక్కగా అమలుచేస్తోంది. అయితే అబద్దాలు ఎప్పటికైనా అబద్దాలనే విషయం బయటపడకమానవు. అందుకే వైసీపీ దురాలోచనలు పదేపదే బెడిసికొడుతున్నాయి. అయితే వాటితో తాత్కాలికంగానైనా టిడిపిని రాజకీయంగా ఇబ్బందిపెడుతూ పైచేయి సాధించగలుగుతున్నందుకు సంతోషిస్తోంది.

ఉదాహరణకు అమరావతి విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించింది కానీ నిరూపించలేకపోయింది. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ అంటూ వైసీపీ నేతలు చాలా మాట్లాడారు. కానీ నిరూపించలేకపోయారు. మాజీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలు చేశారు. వాటినీ నిరూపించలేకపోయారు.

ADVERTISEMENT

అందుకే వైసీపీ నేతలెవరూ ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఐ‌టి నోటీసులు వచ్చాయి.. రూ.118 కోట్లు అవినీతికి పాల్పడ్డారని మంత్రులందరూ కోరస్ పాడటం మొదలుపెట్టారు.

గమ్మతైన విషయం ఏమిటంటే వారిలో ఎవరికీ ఇంతకు మించి మరేమీ తెలియదు. అందుకే ఈ రెండు వాఖ్యాలనే పదేపదే వల్లెవేస్తున్నారు. తద్వారా చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద అవినీతికి పాల్పడ్డారని, జైలుకి కూడా వెళ్ళబోతున్నారనే భావన ప్రజలకు కల్పించేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, అమరావతిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర భవనాలు నిర్మించిన షాపూర్ జీ పల్లోంజీ సంస్థ నుంచి చంద్రబాబు నాయుడుకి రూ.118 కోట్లు ముడుపులు ముట్టాయనేది ప్రధాన ఆరోపణ. వాటిని చంద్రబాబు నాయుడు సహాయకుడు శ్రీనివాస్, అతని అసిస్టెంట్ రాజేష్ ద్వారా ఈ ముడుపులు ఆయనకు ముట్టాయని, మనోజ్ వాసుదేవ్ పార్దసాని అనే వ్యక్తి ఐ‌టి శాఖకు 2019 నవంబర్‌లో వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఐ‌టి అధికారులు తనను బలవంతం చేసి, తన కుటుంబ సభ్యులను వేదించి, భయపెట్టి తన చేత బలవంతంగా ఆ వాంగ్మూలం తీసుకొన్నారని ఆదే నెలలో మనోజ్ ఢిల్లీలోని డెప్యూటీ డైరెక్టర్ (ప్రాసిక్యూషన్)కు ఓ లేఖ వ్రాశారు.

ఇక షాపూర్ జీ పల్లోంజీ సంస్థ కూడా ఏటా ఆదాయపన్ను రిటర్న్స్ సమర్పిస్తూనే ఉంటుంది. కనుక ఒకవేళ రూ.118 కోట్లు ముడుపులు చెల్లిస్తే ఆ విషయం ఐ‌టి శాఖ కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఆ కంపెనీ కూడా తాము ఎవరికీ ముడుపులు ఈయలేదని, ఐ‌టి అధికారులు ఎప్పటికప్పుడు తమ ఆదాయ వ్యయాయల రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నారని తెలిపింది.

మనోజ్ వాసుదేవ్ పార్దసాని వాంగ్మూలం సాయంతో ఆ కంపెనీపై ఐ‌టి అధికారులు ఎప్పుడో కేసు నమోదు చేసి ఉండవచ్చు. కానీ చేయలేదు. అంటే ఆ వాంగ్మూలం అబద్దం… దాని ఆధారంగా చేస్తున్న ఆరోపణలు కూడా అబద్దమని తేలిపోయింది.

కానీ ఐ‌టిశాఖ ఆ వాంగ్మూలం ఆధారంగానే 2022, సెప్టెంబర్‌ 30న తొలిసారిగా నోటీస్ ఇచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు వెంటనే సమాధానం ఇచ్చారు కూడా. బహుశః వైసీపీ రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గిన కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో మళ్ళీ ఐ‌టి శాఖ ఇటీవల చంద్రబాబు నాయుడుకి మరోసారి నోటీస్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

అయితే మొదటి నోటీసుకే దిక్కు లేనప్పుడు మళ్ళీ రెండోసారి నోటీస్‌తో ఏమి సాధించగలరు?దాని వలన ఎవరికి రాజకీయంగా లాభం, ఎవరికి నష్టం అని ఆలోచిస్తే ఇదంతా వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమే అని అర్దమవుతోంది.

చంద్రబాబు నాయుడు లేదా టిడిపి నేతలు స్పందించడం మొదలుపెడితే, దీనిపై మరింత చర్చ జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రతిష్ట దెబ్బ తింటే టిడిపి నష్టపోతుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అందుకే వైసీపీ ఉచ్చులో చిక్కుకోవడం లేదు. అందుకే వైసీపీ నేతలు ఆయనకు గాలం వేసేందుకు పదేపదే రెచ్చగొడుతున్నారని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories