చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ప్రతిపక్ష పార్టీలనే నిషేధించేద్దాం అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతల ముఖ్య అనుచరులుగా చెలామణి అయ్యే వ్యక్తుల అరాచకాలు రోజురోజుకి పరాకాష్టకు చేరుతున్నాయి. రాష్ట్రంలో శాంతియుత నిరసనలను సైతం తమ అడ్డంకులతో వైలెన్స్ గా మారుస్తున్నారు వైకాపా కార్యకర్తలు.
చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ బాబుకి మద్దతుగా శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు శ్రీకాకుళం మాజీ సర్పంచ్ రామకృష్ణ అతని సన్నిహితులు. అయితే తమ సైకిల్ కు టీడీపీ జెండాను తగిలించి పసుపు రంగు షర్ట్ లు వేసుకుని మెడలో పసుపు రంగు టీడీపీ కండువాను ధరించి యాత్ర చేపట్టిన రామకృష్ణ అండ్ కో కు పుంగనూరులో వైసీపీ నేతల రూపంలో అడ్డంకులు ఎదురయ్యాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సుగలమిట్టలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతున్న సూరి అనే వ్యక్తి టీడీపీ మద్దతుదారుల మీద చేసిన దాష్టికం మీడియా సాక్షిగా ప్రజల ముందుకొచ్చింది.అసలు మీ నాయకుడు ఎవరు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఊరు నుంచి వచ్చి ఏం చేస్తున్నారు? తక్షణమే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోండి లేకపోతే,అంటూ వైసీపీ నేతల మాతృ భాష మొదలుపెట్టారు.
ఒరేయ్ ముందు జెండా తియ్యరా, ఇది పెద్దిరెడ్డి అడ్డా, ఇక్కడ టీడీపీ జెండాలు ఎగరడానికి మేము ఒప్పుకోము అంటూ ఆ వ్యక్తుల పై దాడికి దిగారు సదరు పెద్దిరెడ్డి అనుచరుడు సూరి. యాత్ర చేస్తున్న వ్యక్తులను బెదిరిస్తూ వారు వేసుకున్న పసుపు రంగు చొక్కాలను తొలగించాలని, సైకిల్ మీద ఎగిరే టీడీపీ జెండాను తొలగించాలని, పసుపు కండువా ఇక్కడ నిషేధం అంటూ అధికారం మదంతో చెలరేగి పోయారు వైకాపా శ్రేణులు.
జగన్ ప్రభుత్వంలో ఒక టీడీపీ కార్యకర్త సైకిల్ యాత్ర చేస్తేనే ఈ విధంగా వైకాపా నేతలు దాడులు చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్రమంతా ఎలా పర్యటించారో ఒక్కసారి గుర్తుచేసుకోవాలి మరి. ఇదే పద్దతి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అనుసరించి ఉన్నట్లయితే జగన్ పాదయాత్ర పూర్తి చేసేవారేనా? ఇప్పుడిలా రాష్ట్రంలో అరాచకాలు జరిగేనా? వైసీపీ నేతలు తమ అనుచరులను రౌడీలుగా మర్చి ప్రజల పై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు.
టీడీపీ – జనసేన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినా, లేక ఎవరో పెట్టినా పోస్టును షేర్ చేసిన వారి పై సుమోటోగా కేసులు పెట్టి జైళ్లకు పంపే పోలీస్ వారికీ వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతల దాష్టికాలు కనపడవా?
ఏపీలో వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగరడానికి మీ రౌడీల అనుమతి తీసుకోవాలా?అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమే అమలు చేస్తారని చంద్రబాబు, పవన్ ముందుగానే హెచ్చరించారు.అయితే ప్రజలు ఒక్క ఛాన్స్ వైపే మొగ్గుచూపడంతో రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు అంకురార్పణ జరిగింది. ఇప్పటికైనా ప్రజలలో చైతన్యం రాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీల మీద చేసే అరాచకాలు ఇక ప్రజల వద్దకు చేరతాయి. టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజల వద్దకే పాలనకు భిన్నంగా వైసీపీ ప్రజల వద్దకే అరాచకాలు అనే పథకాన్ని అమలు చేస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ పార్టీ జెండా పట్ల వైకాపా వైఖరి చూస్తుంటే ఏపీ లో పసుపు రంగును ఏమైనా జగన్ ప్రభుత్వం నిషేదించిందా? అన్న సందేహం రాకమానదు.




