వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇంతకాలం ఆ హత్యతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, తనను సీబీఐ అన్యాయంగా ఇరికించిందని వాదించారు. వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు ఈ హత్య గురించి పదేపదే మాట్లాడుతూ తనని వేలెత్తి చూపిస్తుండటాన్ని ఆయన తప్పు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడకుండా ఎన్నికల సంఘం చేత ఆదేశాలు కూడా జారీ చేయించుకున్నారు.
కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా వివేకా హత్య కేసు గురించి అఫిడవిట్‌లో పేర్కొనవలసి వచ్చింది. ఆయన మళ్ళీ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తుండటంతో నిన్న నామినేషన్స్ వేసేటప్పుడు అఫిడవిట్‌లో, అభ్యర్ధుల నేర చరిత్ర కాలమ్‌లో వివేకా హత్య కేసుకి సంబందించి పూర్తి వివరాలు పేర్కొనవలసి వచ్చింది.
తాను రెండు క్రిమినల్ కేసులలో నిందితుడినని, తనపై వివేకా హత్య నేరం కింద సీబీఐ వివిద సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసులో తాను ఏ-8 నిందితుడుగా ఉన్నానని అవినాష్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కుట్ర, సాక్ష్యాధారాలు నాశనం చేసినందుకు సీబీఐ మరో కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు. ఈ రెండు కాక మైదుకూరులో మరో క్రిమినల్ కేసు కూడా ఎదుర్కొంటున్నానని అవినాష్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వివేకా హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని అవినాష్ రెడ్డి కోరుకొంటే ఆయనే స్వయంగా అఫిడవిట్‌తో ఇవన్నీ పేర్కొనవలసి రావడం, ఈ వివరాలు మీడియాలో ప్రముఖంగా రావడం దేవుడి స్క్రిప్టే అనుకోవాలి.
అవినాష్ రెడ్డి అఫిడవిట్‌లో తనకు, భార్య సమతకు కలిపి మొత్తం రూ.25.51 కోట్ల విలువగల ఆస్తులున్నాయని పేర్కొన్నారు. కడప, విశాఖ జిల్లాలలో తమకు మొత్తం 61.3 ఎకరాల భూములు ఉన్నాయని అవినాష్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు.




