రాజకీయాల్లో ప్రత్యర్ధులపై విమర్శలనే రాళ్ళు వేయడం షరామామూలు విషయమే. అందులోనూ అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించడం మరింత సర్వసాధారణం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష పార్టీ తీరు వేరు. అధికార పక్షాన్ని ఎంతగా ఇబ్బందులు పెడుతుందో అన్నది పక్కన పెడితే, తనకు తానుగా ఒక రాజకీయ పార్టీ ఎలా గోతిలో పడుతుందో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
[m9ad]
తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేసినా… అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా… కేవలం విమర్శించడమే లక్ష్యంగా… అసత్య కధనాలకు జగన్ మీడియా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందన్న టాక్ ను ఇప్పటికే సొంతం చేసుకుంది. చంద్రబాబు ఢిల్లీ వెళితే, మోడీ కాళ్ళపై పడ్డారని, అలాగే విదేశాలకు వెళితే ‘నల్ల డబ్బు’ను తరలించడానికి వెళ్ళాడని, ఇలా ఒకటేమిటి… చంద్రబాబు తెల్లకారులో వెళితే నల్లకారులో వెళ్లలేదని విమర్శించడం పరిపాటిగా మారిపోయింది.
అయితే ఒక్కోసారి తాము చేస్తున్న విమర్శలు తమకే తిరిగి వస్తాయన్న విషయం ‘జగన్ అండ్ కో’కు తెలియనిది కాదు. తాజాగా జరిగింది కూడా అదే! ప్రధాని నరేంద్ర మోడీని జగన్ కలవడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తన కేసులను మాఫీ చేసుకునేందుకు జగన్ వెళ్లి ప్రధాని కాళ్ళపై పడ్డారని తెలుగుదేశం నేతలు జగన్ పై విరుచుకుపడ్డారు. అయితే జగన్ వెళ్ళిన ఉద్దేశం కేసుల గురించే అయినా… ఇక్కడ వినియోగించిన భాష జగన్ వర్గీయులకు మింగుడుపడనిది.
‘జగన్ వెళ్లి మోడీ కాళ్ళ మీద పడడం’ వంటి భాష సాధారణంగా జగన్ మీడియా సొంతం. ఒక రకంగా ఇలాంటి భాషకు బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మీడియా వ్యవహరిస్తోంది. మరి అలాంటి భాషను తిరిగి జగన్ పైకే ప్రయోగించడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోవడం జగన్ వంతయ్యింది. ఎంత సర్దిచెప్పుకున్నా… బ్యాక్ గ్రౌండ్ లో అక్రమాస్తుల కేసుల చిట్టా ఉండడంతో… ఈ విమర్శలకు బలం తోడయ్యింది. ‘కాలం ఎప్పుడూ ఒకరి వైపే ఉండదు’ అన్న విషయాన్ని ‘జగన్ అండ్ కో’ గుర్తిస్తే… రాజకీయ నాయకులపై ప్రజలలో విలువ పెరుగుతుంది.



