175 సీట్ల కోసమే అంబేడ్కర్ విగ్రహం… కనీసం ఓ మంచి పని చేశారు!

Vijayawada-Ambedkar-Statue

ఏపీలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలే తప్ప కొత్తగా నిర్మించినవి లేవంటే అతిశయోక్తి కాదు. వైసీపి ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, రాజధాని వంటి అత్యంత ముఖ్యమైన అంశాలపై దూరదృష్టి, ఆలోచన, ఆసక్తి చూపనప్పటికీ, 2019లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే 2024లో జరుగబోయే ఎన్నికల గురించి చాలా దూరదృష్టితో ఆలోచించి అవసరమైన ఏర్పాట్లు… సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది.

ADVERTISEMENT

వైసీపి ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అష్టకష్టాలు పడుతూ 2024 ఎన్నికల కోసమే సంక్షేమ పధకాలను కూడా ఆమలు చేస్తూనే ఉంది.

బహుశః 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విజయవాడలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన్నట్లున్నారు.

దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసిందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి చెప్పారు. అనాదిగా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులు తీవ్ర వివక్షకు గురవుతూనే ఉన్నారన్నారు. వారికి సమాజంలో మిగిలిన వర్గాల ప్రజలతో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సమాన అవకాశాలు కల్పించగా, ఆయన అడుగు జాడలలో నడిచే ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా వారికి ప్రభుత్వంలో, పార్టీలో సమాన అవకాశాలు కల్పించి ఎంతో ఆదరిస్తున్నారని విజయ సాయిరెడ్డి చెప్పారు.

డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మీద గౌరవంతోనే విజయవాడ నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు.

అయితే రాష్ట్రంలో నిత్యం బడుగు బలహీన వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఏనాడూ జగన్మోహన్‌ రెడ్డి స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో కొన్ని పట్టణాలు, గ్రామాలలో వారి పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. వారికి సంక్షేమ పధకాల పేరుతో డబ్బు ముట్టజెప్పడం తప్ప జగన్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదు. చేసి ఉంటే, యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు మొరపెట్టుకొని ఉండేవారే కారు కదా?

ఇక మంత్రివర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు, పార్టీలో ఎమ్మెల్యేలకు ఏపాటి గౌరవం లభిస్తోందో పార్టీని వీడి వెళుతున్న వారు చెపుతూనే ఉన్నారు కదా? ఎవరినీ గౌరవించనప్పుడు, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోతుందా?అంబేడ్కర్ విగ్రహం ఎంత పెద్దది ఏర్పాటు చేస్తే అంత ప్రేమాభిమానాలు ఉన్నట్లా?

ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకోవడానికే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి మళ్ళీ నీతులు, ఆదర్శాలు వల్లించడం దేనికి?ప్రజలు ఆ మాత్రం తెలుసుకోలేరనుకున్నారా?

ఏది ఏమైనప్పటికీ కూల్చడమే తప్ప నిర్మించడం ఎరుగని వైసీపి ప్రభుత్వం నాలుగేళ్ళు కష్టపడి 400 కోట్లు ఖర్చు చేసి విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్ళలో వైసీపి చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ఇదొక్కటే కనిపిస్తోంది. కనుక ఇందుకు వైసీపిని అభినందించవలసిందే. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories