టిడిపికి సమస్యలు వచ్చినప్పుడు ‘దేవుడి స్క్రిప్ట్ ఇదే కదా’ అంటూ వెటకారం చేస్తుంటారు. కానీ ఆ దేవుడే వారి స్క్రిప్ట్ కూడా వ్రాస్తాడని గ్రహించిన్నట్లు లేదు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని వైసీపి నేతలు ‘పప్పు… పప్పు…’ అంటూ ఎద్దేవా చేస్తే, వారి చేత ఓ బలమైన నాయకుడిని తయారుచేయించాడు.
మూడు రాజధానులని చెప్పుకొన్న నోటితోనే విశాఖ ఒక్కటే రాజధాని అని చెప్పించాడు. విశాఖ రాజధాని అని చెప్పించిన నోటితోనే అక్కడకు వెళ్ళలేమని చెప్పిస్తున్నాడు. టిడిపి, జనసేనలు కలవకుండా చేయాలనుకొన్న జగన్మోహన్ రెడ్డి చేతే వాటిని కల్పించాడు.
చంద్రబాబు నాయుడుని లోపల వేసి టిడిపిని పెద్దదిక్కు లేని పార్టీగా రోడ్డున పడేయాలనుకొంటే, ఎన్నడూ ఇంటి గుమ్మం దాటి బయటకు రాని ఆయన సతీమణి భువనేశ్వరి ప్రజల మద్యకు వచ్చి ‘నిజం గెలవాలి,’ అంటూ పోరాడుతూ టిడిపికి మరో పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఆమె పోరాటస్పూర్తి, వాగ్ధాటి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు టిడిపికి మరో బలమైన నాయకురాలు లభించారని అభిప్రాయపడుతున్నారు. టిడిపిలో మరో నాయకురాలు ఉద్భవించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డే తోడ్పడ్డారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా?
మురళీ మోహన్ చెప్పిన్నట్లు సూర్య చండ్రులకు కూడా గ్రహణం తప్పదు. కానీ ఆ గ్రహణం కొన్ని గంటలు మాత్రమే పట్టి ఉంచగలదు. అలాగే వైసీపి ప్రభుత్వం కూడా తప్పుడు కేసులతో చంద్రబాబు నాయుడుని కొంతకాలమే బందించి ఉంచగలదు. నేడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చంద్రబాబు నాయుడు బయటకు రాక మానరు. అలాగే రాష్ట్రంలో రాజకీయాలు, బలాబలాలు మారకుండా ఉండవు.
ఢిల్లీ పెద్దల మౌనానికి అర్దం ఒకటైతే రాష్ట్రంలో ప్రజల మౌనానికి అర్దం మరొకటి. ప్రజలు మౌనంగా ఉన్నారంటే దానర్ధం వైసీపి తప్పులన్నిటినీ ఆమోదిస్తున్నట్లు కాదు… అంగీకరిస్తున్నట్లు కాదు. కనుక ఆ దేవుడి స్క్రిప్ట్ లో ఇంకా ఏమేమి ఉందో టిడిపి, జనసేనలకే కాదు… వైసీపికి కూడా త్వరలోనే తప్పకుండా తెలిసి వస్తుంది.






