నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నాము. అక్కడ ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ, ఇక్కడ విజయవాడలో సిఎం జగన్ త్రివర్ణ పతాకం ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. మోడీ అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా అందరూ చెప్పేది ఒక్కటే జాతీయస్పూర్తి… సమైక్యత చాలా అవసరమని.
జాతీయభావం, సమైక్యత గురించి నేడు ఉపన్యాసాలు ఇస్తున్నవారే పరస్పరం నిందించుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలలో మత చిచ్చు రగిలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, దేశసమైక్యతను దెబ్బతీసేవిదంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మోడీ ఆరోపిస్తుంటారు.
యావత్ దేశప్రజలు సిగ్గుతో తలదించుకొనే మణిపూర్ అల్లర్లకు కారణం మీరంటే మీరని నిందించుకొంటూ, జరగకూడని అనర్ధాలన్నీ జరిగి, ప్రజల ధనమానప్రాణ నష్టం జరిగిన తర్వాత మణిపూర్ బాధితులకు అండగా యావత్ దేశ ప్రజలు ఉన్నారని ప్రధాని మోడీ, మేముంటామని ‘ఇండియా’ కూటమి చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.
నేడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అందరికీ తెలుసు. మోడీని గద్దె దించుతానని కేసీఆర్ అంటే, కేసీఆర్‌ని గద్దె దించుతామని కాంగ్రెస్, బిజెపిలు అంటాయి.
ఇక ఏపీ గురించి చెప్పుకోవాలంటే అదో ప్రత్యేక అధ్యాయమే అవుతుంది. రాష్ట్రాన్ని బలంగా కలిపి ఉంచి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయవలసిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతోంది. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టి ర్యాలీ చేయించగా, విశాఖ రాజధాని కోసం అంటూ మంత్రులందరూ గత ఏడాది విశాఖలో ర్యాలీ చేయడమే ఇందుకు నిదర్శనం.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో అడుగు ముందుకు వేసి విశాఖ రాజధానిగా ఉత్తరాంద్ర జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేసుకొందామని ఆలోచనలు చేయకుండా, కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకపోవడం అవమానకరమని భావించకుండా ఇటువంటి వేర్పాటు ఆలోచనలతో కుత్సిత రాజకీయాలు చేస్తూ పాలకులు కాలక్షేపం చేసేస్తుండటం దురదృష్టకరమే.
అభివృద్ధి ఊసెత్తకుండా సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతూ అదే మేము ‘ప్రజలకు చేసే మేలు’ అని నిసిగ్గుగా చెప్పుకోవడం వైసీపీ నేతలకే చెల్లు. తాము ‘ప్రజలకు మేలు’ చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకొంటున్నాయంటూ వితండవాదం చేస్తున్నారు.
బహుశః వైసీపీ నేతల దృష్టిలో ఏపీలో ప్రజలందరూ వెర్రిబాగులోళ్ళు… వారికి సొంతంగా ఆలోచించే తెలివితేటలు ఉండవు.. కనుక తాము ఏమి చెపితే అదే నిజమని నమ్మేస్తారని భావిస్తున్నట్లున్నారు. అయితే ఇదే ఏపీ ప్రజలు గతంలో కాంగ్రెస్ పార్టీకి కొర్రు కాల్చి ఎలావాతలు పెట్టారో ఓ సారి గుర్తుచేసుకొంటే వైసీపీ నేతలు నేడు ఈవిదంగా మాట్లాడే సాహసం చేయరు.
కానీ తమ చేతిలో అధికారం ఉంది కనుక మేమే దేవుళ్ళమనే భ్రమలో ఉన్నారు. కనుక మళ్ళీ ప్రజలే వారి భ్రమలను తొలగించకతప్పదు. ఆ రోజూ మరెంతో దూరం కూడా లేదు.





