ఇదిగో పులి అని ఒకడంటే అదిగో తోక అని మరొకడన్నట్లు, ఇదిగో నేను విశాఖకు వచ్చేస్తున్నా అంటూ జగన్ మంత్రుల ద్వారా చెప్పిస్తుంటే, మంత్రులు కూడా విశాఖలో క్యాంప్ కార్యాలయాలు అంటూ హడావుడి చేస్తున్నారు.
అయితే రాజధాని వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నందున మంత్రులు, అధికారులు ఎవరూ కూడా ‘విశాఖ రాజధాని’ అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. సిఎం జగన్ విశాఖకు మకాం మార్చలేకపోవడానికి కూడా ఇదే కారణమని అందరికీ తెలుసు.
కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో విశాఖని రాజధానిగా మార్చేశామని ప్రజలను మభ్యపెట్టేందుకు, వైసీపి ప్రభుత్వం, మంత్రులు జీవోలు, కమిటీలు అంటూ హడావుడి చేస్తున్నారు. నాలుగేళ్ళుగా విశాఖకు వైసీపి రంగులు పూయడమే తప్ప కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదు. కానీ ఇప్పుడు ప్రజలను నమ్మించేందుకు అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతున్నారు.
ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ వేడిని ఎన్నికల వరకు కొనసాగించాల్సి ఉంటుంది కనుక త్వరలో వరుసపెట్టి శంకుస్థాపనలు కూడా చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించడం ఖాయం. ఈ ప్రయత్నాలలో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణకు విశాఖలోని మునిసిపల్ గెస్ట్ హౌసును క్యాంప్ కార్యాలయంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. నేడో రేపో ఉత్తరాంద్రాకు చెందిన మిగిలిన మంత్రులకు కూడా విశాఖలో క్యాంప్ కార్యాలయాలు కేటాయించవచ్చు. వారందరూ తమ క్యాంప్ కార్యాలయాల ప్రారంభోత్సవాలు అంటూ హడావుడి చేయడం ఖాయమే.
ఈవిదంగా డ్రామాలు ఆడే బదులు అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలో రాజధాని ఏర్పాటుకి తగిన్నట్లుగా ఫ్లైఓవర్లు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన భవనాలు నిర్మించి ఉంటే, వైసీపి ప్రభుత్వానికి కనీసం ఈ విషయంలోనైనా చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మి ఉండేవారు కదా?
కానీ నాలుగున్నరేళ్ళు కాలక్షేపం చేసేసి, ఇప్పుడు ఇటువంటి చిల్లర డ్రామాలు ఆడి ప్రజలను ఇంకా మభ్యపెట్టవచ్చని వైసీపి నేతలు అనుకోవడం ప్రజలను చవట దద్దమలు, గొర్రెలు. వారేమీ అర్దం చేసుకోలేరు. మనం ఏం చెపితే అదే నమ్మేస్తారనే చులకన భావం ఉన్నట్లు అర్దమవుతోంది.
ఇదివరకు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే ఆంధ్రా ప్రజలను చులకనగా చూసింది. దానికి ఏవిదంగా బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు. కనుక తమకి కూడా అదేవిదంగా ప్రజలు బుద్ధి చెప్తారని వైసీపి నేతలు గ్రహించి ఉంటే ప్రజలతో ఈ విదంగా గేమ్స్ ఆడే సాహసం చేసి ఉండేవారు కారు.




