ఆంధ్రాలో 2019 నుంచి వైసీపి కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఈ కొత్త రాజకీయ అధ్యాయంలో ప్రజలు, ప్రతిపక్షాలు కూడా అనేక కొత్త పాఠాలు నేర్చుకోగలిగారు. అవేమిటంటే…
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు. కనీసం మూడు ఉండాలి.
2. విశాఖ రాజధాని ఏర్పాటు కాబోతోంది. లేకుంటే విశాఖ కేంద్రంగా మళ్ళీ రాష్ట్ర విభజన జరిగేది. జగన్ దూరదృష్టి వలన ఆ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ తృటిలో తప్పించుకోగలిగిందని మంత్రి ధర్మానవారు చెప్పారు.
3. జగన్ ప్రభుత్వ పాలన, పధకాలు, ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు అన్నీ ఈ ప్రపంచానికే ఆదర్శం. కానీ ఒప్పుకోకపోవడం అజ్ఞానం, అసూయగానే పరిగణించాలి.
4. హత్యలు చేసి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరగడం పాత పద్దతి. శవాలను డోర్ డెలివరీ చేయడం కొత్త పద్దతి. హత్య కేసులో దర్యాప్తు చేసే సీబీఐ అధికారుల మీదే కేసులు వేయడం ‘చిన్న పిల్లోడి’ స్టైల్.
5. హూ కిల్డ్ బాబాయ్? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ‘వివేకాను ఎవరు చంపారో మీకే తెలుసు’ కనుక ఓట్లు వేయాలని అడగడం కొత్త ట్రెండ్.
6. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దేనికవి విడివిడిగా వైసీపి బోనులోకి వచ్చి సింహానికి ఆహారంగా మారాలి. కానీ ప్రతిపక్షాలు ఈ రూల్ పాటించకుండా పొత్తులు పెట్టుకొని తోడేళ్ళ గుంపులా మీద పడుతున్నాయి. ఇదీ వెరీ బ్యాడ్!
7. వైసీపిలో అభ్యర్ధులు అందరూ ఆణిముత్యాలు, కడు పేదవారు, వెన్నవంటి మంచి మనసున్న నోటి దురుసు ఉన్నవారే.
8. మహాభారతంలో పద్మవ్యూహాన్ని అభిమన్యుడు ఛేదించడం రాంగ్. కనుక ఇప్పుడు అర్జునుడు ఛేదించి విజయం సాధించబోతున్నాడు.
9. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, చివరికి తిరుమలలో కూడా మనవాళ్ళనే ఏర్పాటు చేసుకున్నందున మే 13న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎంపైర్లు కూడా మనవాళ్ళే ఉండాలని సజ్జల వారు కోరుకోవడం సహజమే. కానీ ఎంపైర్ ఓ టీమ్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కనుక మ్యాచ్ ఫలితం వేరేలా ఉంటుందని సజ్జల ఈ అధ్యాయానికి ముగింపు మాట చెప్పేశారు.
10. కనుక జూన్ 4వ తేదీన రాబోయే ఫలితాలు చూసి యావత్ దేశం ఆశ్చర్యపోబోతోందని చెప్పేసి జగన్ విమానం ఎక్కి నేడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు.
కనుక ఈ 5 ఏళ్ళలో ఇన్ని కొత్త విషయాలు, పద్దతులు, అలవాట్లు నేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో సంతోషిస్తూ మనస్ఫూర్తిగా ఓట్లు వేసి మొక్కు తీర్చుకున్నారు.




