విద్యా వ్యవస్థలలో నూతన సంస్కరణల పేరుతో వైసీపీ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అయితే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలను బలపరుస్తూ విద్యా రంగంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు అంటూ మొదలు పెట్టిన జగన్ తరువాత ప్రభుత్వ పాఠశాలలో ఆన్ లైన్ విద్యాబోధన అంటూ బైజూస్ కంపెనీ తో 500 కోట్ల ఒప్పందాలు చేసుకుని ఎనిమిదవ తరగతి నుండి ఉన్న పిల్లలకు టాబ్ లు పంచి అక్కడితో బైజూస్ కథ ముగించారు. ఆ తరువాత ప్రభుత్వ స్కూల్స్ లో సీబీఎస్సి విద్యా బోధన అమలు చేస్తాం అంటూ మళ్ళీ సరికొత్త వాదనతో ముందుకొచ్చారు.
తాజాగా టోఫెల్ తో రాష్ట్ర ఖజానాకు టోపీ పెట్టడానికి సిద్ధమయ్యారు. మూడవ తరగతి పిల్లల నుండి ఈ టోఫెల్ శిక్షణ తరగతులు జరుగుతాయంటూ ఏడాదికి సుమారుగా 1500 వందల కోట్లుతో ఈటీఎస్ అనే సంస్థతో జగన్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా ప్రజా ధనాన్ని శిక్షణా తరగతుల పేరుతో విదేశీ కంపెనీలకు దోచి పెట్టడానికి జగన్ ప్రభుత్వానికి ఎందుకంత తొందరపాటు? అంటూ ప్రశ్నించారు.
రోజుకో రూపం మార్చే ఊసరవెల్లి మాదిరి రోజుకో కొత్త స్కాములతో జగన్ ప్రజలను ఏమార్చడానికి సిద్ధమవుతున్నారు అంటూ పవన్ జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఇప్పుడు ఐబీ సిలబస్ పేరుతో జగన్ విద్యా వ్యవస్థను అడ్డంపెట్టుకుని అతిపెద్ద స్కాం కు శ్రీకారం చుట్టారంటూ జగన్ బాగోతాన్ని బయటపెట్టారు పవన్. ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ అమలు చేయడానికి సుమారుగా 10 నుండి 12 లక్షలు ఫీజు వసూలు చేస్తారని సంవత్సరానికి 4 వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ తన ఇష్టానుసారంగా దోపిచేస్తున్నారని దీనిని జనసేన ఖచ్చితంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.
ఇలా జగన్ ప్రభుత్వం ఒక్కో సంస్థకు వేల కోట్లు దోచిపెడితే 2024 ఎన్నికల తరువాత వచ్చే జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాముల్లో మొట్ట మొదటి బయటపెట్టే స్కాం ఇదేనంటూ పవన్ హెచ్చరించారు. పనిలో పనిగా విద్యా శాఖా మంత్రి బొత్స గారి ఇంగ్లీష్ పాండిత్యాన్ని కూడా ప్రజలకు వివరించారు.ఇలా రోజుకో విద్యా విధానంతో ప్రభుత్వాలు ముందుకొస్తే విద్యార్థుల చదువులు ఎలా కొనసాగుతాయి.ఇలా చేసి పేద విద్యార్థుల జీవితాలతో జగన్ ఆటలు ఆడుకోవడం తప్పితే వారికి ఒరిగేదేమి ఉండదనేది వాస్తవం.
అసలు ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులే కరువైన నేపథ్యంలో ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా! పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ల నియామకాన్ని భర్తీ చేయలేని జగన్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటూ ప్రవచనాలు పలకటం విడ్డురం అన్నారు. ఈ సంస్థతో ఒప్పందాలలో ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఆయా సంస్థల మీద విచారణ జరిపే అవకాశం కూడా ఇక్కడి అధికారులకు కానీ ఇక్కడి ప్రభుత్వానికి కానీ లేవంటూ పెట్టిన షరతులకు కూడా వైసీపీ ప్రభుత్వం అంగీకారం తెలపడం జగన్ చేస్తున్న స్కాం కు సాక్ష్యంగా చెప్పవచ్చు అంటూ పవన్ వైసీపీ ప్రభుత్వం అవినీతిని ఎండగట్టారు.
పెద్దలు వాడే మద్యం నుండి పిల్లలకు అవసరమైన చదువుల వరకు ప్రతి దానిని జగన్ తన వ్యాపార దృష్టితో చూడడం ఏపీ ప్రజల దోర్భగ్యం అన్నారు. సొంత రాష్ట్రములో స్కాములు విదేశాలలో విచారణలు! క్యా బాత్ హై! జగన్.ఇటువంటి వాటి పట్ల ప్రజలలో అవగాహన కల్పించి మీడియాలో కాకుండా ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ జరిగేలా చేయగలిగితే తప్ప పేదలను అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న స్కాములు వెలుగులోకి వచ్చే అవకాశం లేదనేది జనసేన అధినేత గ్రహించాలి. అప్పుడే పవన్ అనుకున్నది సాధించగలుగుతారు.




