వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో నొక్కే బటన్ల కోసం జగన్ అప్పుల బటన్లు నొక్కుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేయడం ఎవరు తప్పుపట్టారు. కానీ ఆసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తనకాలు పెట్టో , దేవాలయాల భూములను వేలానికి పెట్టో, ప్రభుత్వ ఆదాయవనరులను తాకట్టు పెట్టో, కేంద్ర ప్రభుత్వం నుండి అప్పులు తెచ్చో సంక్షేమం అంటే ఎలా ముఖ్యమంత్రి గారు !
ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కాదు రాష్ట్ర సంక్షోభానికి దారితీస్తాయని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టి పెట్టుబడులకు ప్రోత్సహకాలను కల్పిస్తూ, రోడ్డు రవాణా వంటి మౌలిక వసతుల కల్పనతో ఆదాయమార్గాలను సృష్టించి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటి ఫలితాలు భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి అనేది చరిత్ర చెప్పిన వాస్తవాలు.
అప్పులతో సంక్షేమ బటన్లు నొక్కడం అంటే రాష్ట్ర ప్రజల జీవ ప్రమాణాలను పాతాళానికి తొక్కడమే అవుతుంది.రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం తప్పుకాదు ఆ అప్పులను ప్రోజెక్టుల పూర్తి కోసమో,రాష్ట్ర అభివృద్ధి కోసమో ఉపయోగించుకుంటే ప్రజలు ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రాదు అనేది ప్రభుత్వాలు గుర్తించిన రోజే నిజమైన అభివృద్ధిని ప్రజలు చూడగలుగుతారు.
ఉదాహరణకు…,గత ప్రభుత్వ హయాంలో లక్ష మందికి ఉచిత పథకాలు అందిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసంఖ్య రెండు లక్షలకు చేరింది అంటూ గొప్పలు చెప్పే నేతలు ప్రజల ఆర్థిక పరిస్థితిని పెంచుతున్నట్టా? తగ్గించినట్టా? గతంలో లక్ష మంది పేదలు ఉంటె ఇప్పుడు ఆ సంఖ్యను రెండు లక్షలకు చేర్చిన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం అందిస్తుందా? లేక వారిని సంక్షోభంలోకి నెడుతుందా? అనేది ప్రజలు కూడా ఇక్కసారి ఆలోచించాలి.
అప్పులతో రాష్ట్రాన్ని పాలించడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే అవుతుంది. అది ఎప్పటికైనా గమ్యాన్ని చేరలేదు అనేదే వాస్తవం. ఇది ఏఒక్క ప్రభుత్వాన్నో తప్పుపట్టడం కాదు వర్తమాన రాజకీయాలలో ప్రభుత్వాలు గొప్పగా చెప్పే సంక్షేమ పథకాల అమలుతో వచ్చిన ఫలితాలివే వీటికి సాక్ష్యాలు.
ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాలు కాదు ఉపాధిని అందించినప్పుడే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మన నేల నిలబడుతుందని ప్రజలు కూడా గ్రహించాలి. అలాగే గొంతెత్తిన ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రభుత్వం తన అధికారంతో నిర్బంధించో కేసులు పెట్టో, జైళ్లకు పంపో అణచివేయాలని చేస్తే అది తాత్కాలిక ఆనందాన్నే మిగులుస్తుంది. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి వాడిని జైలుకు పంపితే పాలన ముందుకు సాగుతుందా?
చంద్రబాబు అరెస్ట్ జరిగి దాదాపుగా ఇరవై రోజులు గడుస్తున్నా ఇంకా ప్రజలలో అదే చర్చ, పత్రికలలో, మీడియాలో అదే వార్త నడుస్తుంది. దీని వలన ప్రభుత్వ పాలన గాడితప్పడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ నేత అరెస్టు అవుతాడో అనే వాదనే నడుస్తుంది కానీ ప్రాజెక్టులు పూర్తి చేసేది ఎప్పుడు? రాజధాని నిర్మాణం ఏది? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు ఎక్కడా? ప్రత్యేక హోదా వస్తుందా, రాదా?అనే ప్రశ్నలను అడిగే వాడే లేడు! చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకపోయింది.
ఇలా సమస్యలను పక్కదారి పట్టించడానికి జగన్ సలహాదారులు గట్టిగానే కృషి చేస్తున్నట్టున్నారు. ప్రజలు కూడా ఆజగన్మాయలో పడితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం ప్రశ్నించాల్సిన అవసరమే రాకపోవచ్చు కూడా! అప్పులతో సంక్షేమం – అరెస్టులతో పాలన! ఇదే వచ్చే ఎన్నికలకు వైసీపీ ఎంచుకున్న కొత్త నినాదం కానుందేమో!





