ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన చుట్టూ ఉన్న అధికారులు నెమ్మదిగా మళ్ళీ జగన్ చుట్టూ చేరుతున్నారు. వారు ఆసక్తి చూపుతున్నారో లేక జగన్ ఆసక్తో తెలీదు గానీ అప్పటి వారు తెలంగాణాలో పని చేస్తున్నా ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో కొందరు జగన్ అవినీతి కేసులలో దోషులు కూడా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన రెడ్డి సామజిక వర్గ అధికారులు కూడా జగన్ ను కలిసి పదవులు కోసం అర్జీ పెట్టుకుంటున్నారు.
గనుల కేటాయింపు విషయంలో ఆరోపణలు ఎదురుకున్న అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తూ, ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే దీనివల్ల జగన్ కు అనవసరమైన చెడ్డ పేరు రావడం ఖాయం. సరైన పాలనతో గతంలో తన మీద ఉన్న మచ్చలు తుడుచుకుని ప్రయత్నం చెయ్యాల్సింది పోయి మళ్ళీ వారినే తెచ్చి పెడితే అనవసరమైన వివాదాలకు కేంద్రబిందువు కావడమే. జగన్ ముందు అనేక సవాళ్ళు ఉన్న తరుణంలో ఇటువంటివి పూర్తిగా అనవసరమనే చెప్పుకోవాలి.
ఇటువంటి చిన్న చిన్న తప్పులే తెలుగుదేశం, పార్టీకి తిరిగి ఊపిరి ఊదే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో వై జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నవరత్నాల పేరిట ప్రజలకు చేసిన తొమ్మిది వాగ్దానాల అమలు చెయ్యడంలోనే జగన్ పాలనను ప్రజలు అంచనా వెయ్యబోతున్నారు.



