ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. గడచిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కంటే రాయలసీమ ముఖద్వారంగా ఉన్న కర్నూలు జిల్లాలో అధిక ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లుంటే… వైసీపీ 11 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ప్రస్తుత పరిస్థితి మారింది. టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు కర్నూల్ జిల్లాల్లోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.
జిల్లాలోని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్ది, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆలూరు ఎమ్మెల్యే మణిగాంధీలు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. అయితే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. తన పార్టీకి అత్యంత బలమైన జిల్లాగా ఉన్న కర్నూలు నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే, పార్టీకి అపార నష్టమేనని భావించిన జగన్, నష్ట నివారణ చర్యలు చేపట్టబోతున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలను నిలువరించేందుకు జగన్ చేసిన యత్నాలు బెడిసికొట్టడంతో, తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డితో పాటు బళ్లారి ఎంపీ శ్రీరాములును రంగంలోకి దించినట్లుగా పొలిటికల్ వర్గాల టాక్. ఆర్థికంగా బలవంతులైన ‘బళ్లారి బ్రదర్స్,’ జగన్ ఇచ్చిన సూచనతో ఇఫ్పటికే రంగంలోకి దిగిపోయారని సమాచారం.
విడతల వారీగా జరిపిన చర్చల్లో భాగంగా పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతతో పాటు భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామన్న హామీతో పార్టీ మారాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ నేతలు మనసు మార్చుకున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ‘బళ్లారి బ్రదర్స్’ హామీలకు ఏ మాత్రం తలొగ్గని ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారట. దీనికి అనుచరుల నుంచి మద్దతు రావడంతో త్వరలోనే సదరు ఎమ్మెల్యే మాత్రం సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.



