ఈరోజు తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకి కార్యక్రమంపై సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎప్పటిలాగే ఈ ప్యాక్ సర్వే రిపోర్ట్ చేతపట్టుకొని 18 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని అన్నారు. మిగిలినవారిలో కూడా సగం మంది పనితీరు మెరుగు పరుచుకోవలసి ఉందన్నారు.
ఆ 18 మంది ఎమ్మెల్యేలతో తాను వేరేవేరుగా సమావేశమై వారికి చివరిగా మరోసారి నచ్చజెపుతానని, అయినా పనితీరు మెరుగుపరుచుకోకపోతే పక్కన పెట్టేస్తానని స్పష్టంగా చెప్పారు. పనితీరు సరిగా లేనివారిని నమ్ముకొని తాను ఎన్నికలలో పార్టీని నష్టపరుచుకోలేనని సిఎం జగన్ చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ విధిగా గడప గడపకి కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రజలకు చేరువవ్వాలని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించి పార్టీకి వారి మద్దతు కూడగట్టాలని సిఎం జగన్ హితబోధ చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితులలో 175 సీట్లు మనమే గెలుచుకోవాలని మరోసారి గట్టిగా నొక్కి చెప్పారు.
గత ఏడాది నిర్వహించిన సమీక్షా సమావేశంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పగా ఇప్పుడు ఆ సంఖ్య 18కి తగ్గడం నిజమైతే, వైసీపీ అది శుభసూచకమే. అయితే గడప గడపకి కార్యక్రమంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలను, నిరసనలను బట్టి చూస్తే ఆ సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది తప్ప తగ్గదని అర్దమవుతోంది. అసలు ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళేందుకు వెనకాడుతున్నారంటేనే పరిస్థితి అర్దమవుతోంది కదా?
మిగిలిన ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది పనితీరు మెరుగు పరుచుకోవాలని చెప్పడానికి బహుశః అదే అర్దం అయ్యుండవచ్చు. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేనప్పుడు 175 సీట్లు ఏవిదంగా గెలుచుకోగలమని జగన్ భావిస్తున్నారో తెలీదు. కానీ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే ఈసారి వైసీపీకి ఎదురీత తప్పదని స్పష్టమవుతోంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రాయలసీమలో అపూర్వ స్పందన వస్తోంది. చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో పర్యటిస్తున్నా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్‌కు బలం పెరిగిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అవినీతి, అరాచక పరిస్థితులు నెలకొన్నాయంటూ బిజెపి పెద్దలు జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేశారు. మరోపక్క కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ షర్మిల బిజెపి,కాంగ్రెస్ పార్టీల తరపున రంగంలో దిగుతున్నారు.
ఇవన్నీ రాజకీయ పరిణామాలు కాగా విద్యుత్ చార్జీల పెంపు, ఇంటి పన్ను పెంపు, విద్యుత్ కోతలు, సంక్షేమ పధకాలలో నిబందనల పేరుతో కోతలు, రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, భౌతికదాడులు, వైసీపీ నేతల దోపిడీలు, దౌర్జన్యాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ప్రతిపక్ష నేతలకు అంత ఆదరణ లభిస్తోంది.
అయినప్పటికీ ‘175 సీట్లు మనకే’ అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను భ్రమలో నడిపిస్తే నష్టపోయేది ఎవరు? ప్రతిపక్షాలు కాదంటాయా?



