పెళ్లిళ్లకు వెళ్తున్నారుగా… కోర్టుకు రాలేరా..?

YS Jagan -skipping court casesముఖ్యమంత్రిగా రాష్ట్ర విధులు నిర్వహించాలి, వారంలో అయిదు రోజులు కోర్టుకు వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయి గనుక వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును రిజర్వులో ఉంచింది.

ఈ తీర్పు ఎలా వస్తుందా? అన్న ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలలో కూడా నెలకొని ఉంది. గడిచిన రెండేళ్లలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చేస్తానని జగన్ చెబుతుండడంతో, హైకోర్టు ఇవ్వనున్న తీర్పు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారనుంది. అయితే తాజాగా ఓ వాదన తెరపైకి వచ్చింది.

ADVERTISEMENT

ఏపీలో వరదలు – పెళ్లిళ్ల సీజన్ ఒకసారే వచ్చాయి. వరదలంటే ప్రకృతి సృష్టి కాబట్టి ఏం చేయలేకపోవచ్చు, కానీ పెళ్లిళ్లు అంటే మానవ సంబంధాల రీత్యా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ బంధాలకు విలువనిస్తూ వివిధ పెళ్లిళ్లకు హాజరవుతున్నారు.

తాజాగా బుధవారం నాడు కూడా ఓ వివాహ కార్యక్రమానికి హాజరై రిలేషన్ కు తాను ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పారు. అయితే వరుసగా ఇన్ని వివాహాలకు హాజరవుతున్న వ్యక్తి, కోర్టు విచారణకు హాజరు కాలేరా? అందులోనూ సంవత్సరాల తరబడి సాగుతోన్న కేసులు! ఇదే వాదన రేపు కోర్టులో సీబీఐ తరపు న్యాయవాదులు వ్యక్తపరిస్తే ఏమవుతుంది?

దానిని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందో లేదో గానీ, ఒకవేళ కోర్టు ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని జగన్ ను విచారణ నిమిత్తం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏం కానూ? అన్న ఆలోచనలలో రాష్ట్ర ప్రజలు తలమునకలై ఉన్నారు. అసలే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ రెడీ అయ్యిందనే మీడియా సమాచారం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది.

అయినా తన మీద పెట్టినవి అంతా కాంగ్రెస్ – చంద్రబాబు కుట్ర పన్ని పెట్టిన కేసులని జగన్ చాలా సందర్భాలలో వ్యక్తపరిచారు కదా! మరి అవన్నీ తప్పని ఎంత త్వరగా నిరూపించుకుంటే, అంత త్వరగా కేసులు లేని వ్యక్తిగా నిలుస్తారు కదా! వారంలో అయిదు రోజులు కాకపోయినా, అవసరమైనపుడు హాజరై ఆ కేసుల నుండి బయటపడిపోవచ్చు కదా!

ఎందుకంటే జగన్ లెక్క ప్రకారం అవన్నీ “రాజకీయ కేసులే, తప్ప వాటిల్లో నిజం లేదు కదా!” ఒకవేళ జగన్ మాటలే వాస్తవమైతే, ఇప్పటివరకు ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అటాచ్ చేసిన కొన్ని వందల కోట్ల విషయంలో ఎందుకు పోరాటం చేయడం లేదు? ఏమోనండి… ప్రజలకైతే ఈ లెక్కలేమి అర్ధం కాదు, నమ్మి ఓట్లు వేయడం తప్ప!

ADVERTISEMENT
Latest Stories