పోలవరం నుండి నవయుగ కంపెనీని తప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేనట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంపై పార్లమెంట్ లో మాట్లాడుతూ…. పోలవరం కాంట్రాక్టు రద్దు బాధాకరమని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ వ్యాఖ్యానించారు. మళ్లీ టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. పోలవరం రీటెండర్ల వల్ల ప్రాజెక్ట్ ఖర్చు ఖచ్చితంగా పెరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అందరూ కేంద్రాన్ని అడుగుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని షెకావత్ వివరించారు. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రప్రభుత్వం తన సొంత సొమ్ముతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అయితే ఆ తరువాత అనేక కొర్రీలు వేసి ఆ డబ్బు తిరిగి ఇవ్వడంలో తీవ్ర తాత్సారం చేసేది. దానితో ప్రభుత్వం బాగా ఇబ్బంది పడేది. మరోవైపు టెండర్ల రద్దు వంకతో ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూడా కేంద్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ప్రాజెక్టుకు డబ్బులు పెట్టే తమను కనీసం పరిగణలోకి తీసుకోకుండా టెండర్లు రద్దు చెయ్యడం ఏంటి అని కేంద్రప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారంట. కొత్త టెండర్లు పిలిస్తే మళ్ళీ ఆ భారం తమ మీదే పడుతుందని కేంద్రం అసహనం. ఈ విషయాన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల ఆరున ప్రధాని అప్పాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటివరకూ ప్రధాని ఆఫీస్ ఖరారు చెయ్యలేదు.



