సంక్షేమ పధకాలతో అందరికీ మేలు చేశామని గొప్పలు చెప్పుకునే జగన్, పోలింగ్‌కు ముందు రూ.14,000 కోట్లు విడుదల చేయబోతే వాటిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే పోలింగ్ తర్వాత ఆ నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయకుండా లండన్ వెళ్ళిపోయారు.
జగన్ ఎంతో గొప్పగా చెప్పుకునే సంక్షేమ పధకాల విషయంలోనే ఈవిదంగా వ్యవహరించడం అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన్నట్లని అనుకోవాలేమో?
జగన్ గొప్పగా చెప్పుకునే వాటిలో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. తమ ప్రభుత్వం నిరు పేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందని పదేపదే చెప్పుకునేవారు. కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు బకాయిలు మాత్రం చెల్లించడం లేదు.
ఇప్పటికే ఈ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) పలుమార్లు బకాయిల చెల్లించాలని లేకుంటే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తామని ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి. ప్రతీ మూడు నెలలకు బకాయిలు క్లియర్ చేయవలసి ఉండగా, ఆరేడు నెలలకు ఓ సారి కూడా క్లియర్ చేయకపోవడంతో బకాయిలు పేరుకు పోతూనే ఉన్నాయి.
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంచుమించు ఇలాగే జరుగుతోందని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై.రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ చెప్పారు.
మళ్ళీ రూ.1500 కోట్లు బకాయిలు పేరుకుపోవడంతో, మంగళవారం రాత్రి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మితో మాట్లాడమని, త్వరలోనే ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని హామీ ఇచ్చారని ఆశా ప్రతినిధులు చెప్పారు. కానీ జూన్ 4 వరకు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంటుంది కనుక అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించలేదని భావిస్తున్నామని చెప్పారు.
కనుక బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో అందించిన వైద్య సేవలు, మందుల ఖర్చు బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని, కనుక ఈ బకాయిలు చెల్లిస్తుందని నమ్మకం లేదని అందుకే నేటి నుంచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై.రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ చెప్పారు.
కానీ మానవతా దృక్పదంతో ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులందరికీ వైద్య సేవలు కొనసాగిస్తామని, కానీ కొత్త కేసులను తీసుకోబోమని చెప్పారు.
జగన్ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ క్రెడిట్ కావాలి కానీ డెబిట్ వద్దన్న మాట! ఆ పేరు చెప్పుకొని ఓట్లు దండుకున్నప్పుడు, ఆసుపత్రులకు బాకాయిలు చెల్లించాలి కదా?
ఇలా చేసే ప్రతీ పనిని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వినియోగించుకోవడమే తప్ప దేనిలోనూ చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. చిత్తశుద్ధి లేని శివపూజలు ఫలించవని జూన్ 4న వెలువడే ఫలితాలు స్పష్టం చేయబోతున్నాయి.
—




