లా నేస్తాలు మనతోనే ఉన్నారా సార్?

YS-Jagan-LAW-Nesthamజగన్ పాలనలో అడగనివాడిదే పాపం అన్నట్లు, సంక్షేమ పధకాల పేరుతో అందరికీ డబ్బు పంచిపెడుతూనే ఉన్నారు. నేడు వైఎస్సార్ లా నేస్తం పధకం కింద రాష్ట్రంలో 2,677 జూనియర్ న్యాయవాదులకు రూ.6.12 కోట్లు బటన్ నొక్కి విడుదల చేశారు. లా చదువు పూర్తయిన తర్వాత తమ వృత్తిలో నిలదొక్కుకొనేందుకు మూడేళ్ళపాటు ఒక్కొక్కరికీ నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60, 000 చెల్లిస్తోంది. ఈ లెక్కన మూడేళ్ళలో ఒక్కొక్కరికీ రూ.1,80,000 చొప్పున ఇస్తోంది. నేడు విడుదల చేసిన దానితో కలిపి ఈ నాలుగేళ్ళలో 5,781 మంది జూనియర్ లాయర్లకు మొత్తం రూ.41.52 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.

వైసీపీ ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకే జగన్ ప్రభుత్వం అభివృద్ధి మీద ఖర్చు చేయాల్సిన ప్రజాధనాన్ని సంక్షేమ పధకాల మీద ఖర్చుచేస్తోంది. ఈ పధకం కూడా అందుకే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో న్యాయవాదులందరూ జగన్ ప్రభుత్వం గురించి ఏమనుకొంటున్నారు?అని ఆలోచిస్తే ‘కర్నూలును న్యాయరాజధానిగా చేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తానని’ ప్రచారం చేసుకొన్న జగన్ ప్రభుత్వం మాట తప్పిందని అందరూ భావిస్తున్నారు.

ADVERTISEMENT

ఎందుకంటే, మూడు రాజధానులనేది ‘ఓ కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్.’ ‘నిజానికి విశాఖ ఒక్కటే రాజధాని’ అని సాక్షాత్ రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా బయటపెట్టేశారు. మరోసందర్భంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది.

కనుక న్యాయరాజధాని పేరుతో జగన్ ప్రభుత్వం తమను మోసం చేసిందని రాయలసీమలో న్యాయవాదులు భావిస్తున్నారు. అందుకే ఇదివరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు, ఇటీవల నారా లోకేష్‌ పాదయాత్ర చేసినప్పుడు కర్నూలులో న్యాయవాదులు వారికి సంఘీభావం తెలిపారు.

ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలు న్యాయరాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి టిడిపి, జనసేనలను రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో అడుగుపెట్టనీయకుండా చేయాలని వైసీపీ వ్యూహం పన్నితే, ఇప్పుడు అదే దానిమెడకు ఉరిత్రాడులా చుట్టుకొంది.

కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయనందుకు సీమలో న్యాయవాదులు, అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు ఉత్తరాంద్ర, అమరావతిలో న్యాయవాదులు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక లా నేస్తం పేరుతో కొంతమంది జూనియర్ లాయర్స్‌కు ఆర్ధికసాయం అందిస్తున్నా, రాష్ట్రంలో అధికశాతం న్యాయవాదులందరూ వైసీపీని వ్యతిరేకిస్తునే ఉన్నారు. కనుక ఈ పధకం ఏట్లో పిసికిన చింత పండువంటిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కకపోవడం అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories