మీ డ్రీమ్స్ మీవే… నా స్కీమ్స్ నావే!

Jagan Manifesto

రజనీకాంత్ రోబో 2.0 వెర్షన్‌లాగ వైసీపి మ్యానిఫెస్టో జగనన్న నవరత్నాలు+ వెర్షన్ తాజాగా రిలీజ్ అయ్యింది. అయితే 2.0 వెర్షన్ ఫెయిల్ అయిన్నట్లే ఈ నవరత్నాలు+ వెర్షన్ కూడా ఫెయిల్ అయిన్నట్లే కనిపిస్తోంది.

ముందుగా దానికి జోడించిన ‘మీ డ్రీమ్స్, నా స్కీమ్స్’ క్యాప్షన్ గురించి చెప్పుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT

అసలు ఆంద్రా ప్రజల డ్రీమ్స్ ఏమిటి? సంక్షేమ పధకాలా?అంటే కాదనే అందరికీ తెలుసు. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అమరావతి రాజధాని పనులు వేగవంతం చేసి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని ప్రజలు భావించారు. కానీ చేయలేదు.

రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రప్పించి ఉద్యోగాలు కల్పించి ఎవరి కాళ్లపై వారు నిలబడేలా చేస్తారని ప్రజలు అనుకున్నారు.

కానీ ‘మీ డ్రీమ్స్ వేరు నా స్కీమ్స్ వేరు’ అన్నట్లు సంక్షేమ పధకాలతో మేలు చేస్తున్నానంటూ వైసీపి ఓటు బ్యాంక్ నిర్మించుకున్నారు. దాని కోసం లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ భారం మళ్ళీ ప్రజలపైనే మోపారు. అయినకాడికి ప్రభుత్వాస్తులు తాకట్లు పెట్టేశారని వార్తలు చూస్తూనే ఉన్నాము.

టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబందించిన పలు సమస్యలు, అంశాలపై అవి పేర్కొన్న పరిష్కారాలతో పోల్చి చూస్తే ‘నవరత్నాలు+’ కాదు ‘మైనస్’ అనిపించక మానదు.

విశాఖ రాజధాని గురించి మాట్లాడరెందుకు?

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, విశాఖని రాజధానిగా చేస్తామని జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపిలో అందరూ ఎంత హడావుడి చేశారో అందరికీ తెలుసు. కానీ ఈ ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపిలో ఎవరూ కూడా దాని గురించి మాట్లాడే సాహసం కూడా చేయలేకపోతున్నారు… ఎందువల్ల?

కనీసం తమ మ్యానిఫెస్టోలో కూడా విశాఖ రాజధాని గురించి గట్టిగా హామీ ఇవ్వలేక క్లుప్తంగా ఒకే ఒక్క వాఖ్యంతో ముగించారు. అంటే ఈ విషయంలో కూడా వైసీపికి చిత్తశుద్ధి లేదనే కదా? చిత్తశుద్ధి లేని శివపూజలు ఫలించవు.

ఏపీ రాజధాని విషయంలో కూడా ప్రజలకు హామీ ఇవ్వలేకపోతున్న వైసీపికి ప్రజలు మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలి? రాష్ట్ర గౌరవం, అభివృద్ధికి సంబందించిన రాజధాని విషయంలో కూడా దొంగాటలు ఆడుతున్న వైసీపిని ప్రజలు మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలి? నెత్తిన పెట్టుకొని ఎందుకు మోయాలి?

లక్షల కోట్ల అప్పులున్నాయి 80,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?

నవరత్నాలు +లో ‘రైతుల బాగుకై వైఎస్సార్ భరోసా పధకం ద్వారా రాబోయే 5 ఏళ్ళలో రూ.80,000 కోట్లు అందిస్తాం’ అని తాటికాయంత అక్షరాలతో జగన్‌ ఫోటోతో హామీ ఇచ్చింది.

ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలే ఇవ్వలేకపోతున్న జగన్‌ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇక ఎక్కడా అప్పు పుట్టే అవకాశం కూడా లేదు. కానీ మళ్ళీ గెలిపిస్తే రాబోయే 5 ఏళ్ళలో రైతులకు రూ.80,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుంది?

పోనీ ఈ 5 ఏళ్ళలో జగన్‌ ప్రభుత్వం రైతులకు ఏమైనా చేసిందా? అంటే లేదని మైదుకూరు ఎన్నికల ప్రచార సభలో జగన్‌ స్వయంగా చెప్పుకున్నారు. రాజోలి ప్రాజెక్టు ప్రాధాన్యతను తమ ప్రభుత్వం గురించలేక పోయిందని, శంకుస్థాపన చేసి విడిచిపెట్టేశామని, వైసీపిని మళ్ళీ గెలిపిస్తే ఈసారి తప్పకుండా పూర్తిచేస్తామని స్వయంగా చెప్పుకున్నారు.

అదొక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోవడం వలన పూర్తికాలేదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని మంత్రి అంబటి రాంబాబు నాలుగేళ్ళ క్రితమే చెప్పేశారు. అందుకే అది నేటికీ పూర్తికాలేదు.

అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులతో జగన్‌ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అందరూ కళ్ళారా చూశారు. మళ్ళీ గెలిపిస్తే రైతులను గౌరవిస్తుందంటే నమ్మశఖ్యంగా ఉందా?

గత ఎన్నికలలో ప్రజలు వైసీపీని చాలా భారీ మెజార్టీతో గెలిపించి అధికారం కట్టబెడితే 5 ఏళ్ళు ఇష్టారాజ్యం చేసిందే తప్ప ప్రజల ఆకాంక్షలు, సమస్యలు అర్దం చేసుకోలేదు. కనుక ‘మీ డ్రీమ్స్ నా స్కీమ్స్’ని ‘మీ డ్రీమ్స్ మీవే… నా స్కీమ్స్ నావే’ అని క్యాప్షన్ మార్చుకుంటే చాలా చక్కగా నప్పుతుంది.

ADVERTISEMENT
Latest Stories