వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌కే… అందరూ రెడీయేనా?

YS Sharmila: A Missed Political Arrow

తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని చెయ్యి కాల్చుకొన్న వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవడంతో ఆమెకు ఆ కుంపటి కూడా లేకుండా పోయింది. గట్టు రామచంద్రరావు వంటి సొంత పార్టీ నేతలే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్‌ను నమ్ముకొని కుంపటి పోగొట్టుకొని రాజకీయ నిరుద్యోగిగా మారిన వైఎస్ షర్మిలని కాంగ్రెస్‌ అధిష్టానమే దారి చూపబోతోంది.

ADVERTISEMENT

ఆమె రాజకీయ ప్రస్థానంలో ‘థర్డ్ ఇన్నింగ్స్’ జనవరి మొదటి వారంలో ప్రారంభించబోతున్నారు. ఆమె వచ్చే నెల కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ ఆమె పార్టీ పగ్గాలు చేపట్టకపోయినా ఏపీ కాంగ్రెస్‌కి మళ్ళీ ప్రాణప్రతిష్ట చేసేందుకు తోడ్పడతారని తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్‌ ‘పునరుజ్జీవనం’ అంటే కాంగ్రెస్‌లో నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయిన సీనియర్ నేతలను వెనక్కు తెచ్చుకోవడమే అని వేరే చెప్పక్కరలేదు.

జగన్మోహన్‌ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతుండటంతో టికెట్‌ ఇవ్వకుండా పక్కనపెడితే తమ పరిస్థితి ఏమిటని వైసీపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కనుక వైఎస్ షర్మిల వచ్చి ఏపీ కాంగ్రెస్‌ కార్యాలయం బూజు దులిపి తలుపులు తెరిస్తే అటువంటి వారందరూ చరచరా… బిరబిరా వచ్చేస్తారని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

ఇంతకాలం జగన్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేల చేతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను నోటికి వచ్చిన్నట్లు మాట్లాడించడంతో వారికి టిడిపి, జనసేనల తలుపులు మూసుకుపోయాయి. కనుక వాటికి ప్రత్యామ్నాయంగా ఏపీ కాంగ్రెస్‌ మాత్రమే కనబడుతోంది. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచన ఫలించే అవకాశం ఉంది.

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో అడుగుపెడితే ముందుగా వైసీపి నేతలను పార్టీలోకి ఆకర్షించడం, ఆ తర్వాత శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్దం చేసుకోవడమనే రెండు పెద్ద బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తన సొంత అన్న జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న వైసీపిని రాజకీయంగా దెబ్బ తీయడం వైఎస్ షర్మిలకు ఇంకా కష్టం… చాలా ఇబ్బందికరం కూడా. అందుకే మొదట ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరేందుకు విముఖత చూపారు. కానీ ఇప్పుడు ఆమెకు కూడా వేరే ఆప్షన్స్ లేవు. కనుక ఏపీ కాంగ్రెస్‌లో చేరి జగనన్నపైనే బాణం గురిపెట్టాల్సి ఉంటుంది.

ఇక తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకుండా తప్పుకొని కాంగ్రెస్‌కు మేలు చేసింది కనుక కాంగ్రెస్‌ పార్టీ కూడా ఏపీ ఎన్నికలలో టిడిపి, జనసేనలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పడటం ఖాయమే. అదే సూచిస్తూ వైఎస్ షర్మిల నారా లోకేష్‌కు క్రిస్మస్, న్యూఇయర్ గ్రీటింగ్స్, బహుమతి పంపించారు కూడా. వైఎస్ షర్మిల రావడం దాదాపు ఖాయం అయ్యిన్నట్లే కనుక జగన్మోహన్‌ రెడ్డి, వైసీపిలో ఉండేవాళ్ళు ఆమెను ఎదుర్కోవడానికి సిద్దంగానే ఉన్నారా? వైసీపిలో టికెట్‌ నిరాకరించబడిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు అందరూ సిద్దమేనా?

ADVERTISEMENT
Latest Stories