రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో చాలా వేగంగా నిర్ణయం తీసుకొన్నారు.
రాష్ట్రానికి, ప్రజలకు ఇది ఆత్మగౌరవమని, బలమైన రాజధాని ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తాయని అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు భావించారు. అందుకే చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించారు.
ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడం, మూడు రాజధానులు, ఒక్క రాజధాని కాకమ్మ కధలూ వాటి వెనుక రాజకీయ దురాలోచనలు అన్నీ ఏపీ ప్రజలకు బాగా తెలుసు.
పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ళ పాలన పూర్తిచేసుకొన్న తర్వాత నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ జారీ కాబోతుంటే, వైసీపి సీనియర్ నేత, జగన్ తన బంధువు వైవీ సుబ్బారెడ్డి చేత ‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని’గా చేయాలనే కొత్త ప్రతిపాదనను చేయించారు.
దీనిపై అటు తెలంగాణలో, ఇటు ఏపీలో రాజకీయ పార్టీలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. చివరికి ఏపీ సిఎం సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ ప్రతిపాదనపై “ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే… ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా? మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?” అంటూ చాలా ఘాటుగా స్పందించారు.
“మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా వైసీపీ కి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదు,” అంటూ ట్విట్టర్‌లో పెద్ద మెసేజ్ పెట్టారు.
ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికకు ముందు జగన్ ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదన చేయడం ద్వారా తమ దోస్త్ కేసీఆర్‌కు ‘సెంటిమెంట్ అస్త్రం’ అందించి, తమ ఉమ్మడి శత్రువు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు అనుమానించక తప్పదు.
కానీ తెలంగాణలో వైసీపి నేతల వేలకోట్ల బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈ కొత్త ప్రతిపాదన అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు మాటలు కూడా చాలా ఆలోచింపజేస్తాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్, జగన్, బిఆర్ఎస్ పార్టీ రాజకీయ శత్రువులే కనుక వారి బినామీ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల మేరకు బిఆర్ఎస్ నేతలు కబ్జాలు చేసిన భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు తమ ఆస్తులని కూడా స్వాధీనం చేసుకొనే ప్రమాదం ఉంటుందనే వైసీపి మేధావులకు ఈ కొత్త ఆలోచన కలిగి ఉండవచ్చని అచ్చన్నాయుడు చెపుతున్నట్లు భావించవచ్చు.
ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే…
ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలే.రాష్ట్రానికి రాజధాని లేదు.ప్రత్యేక హోదా రాలేదు.ప్రత్యేక ప్యాకేజీలు…— YS Sharmila (@realyssharmila) February 15, 2024
—




