వైఎస్ షర్మిల తెలంగాణలో దాదాపు మూడేళ్ళకుపైగా రాజకీయాలలో రాణించాలని చాలా పట్టుదలగా శ్రమించారు. కానీ అక్కడ తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉందనే చిన్న విషయం గుర్తించకుండా ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తానంటూ తిరిగి నవ్వులపాలయ్యారు.
కానీ కాంగ్రెస్ రూపంలో ఆమెని అదృష్టం వరించింది. తెలంగాణలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న ఆమెను, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి మీదకు కాంగ్రెస్ బాణంగా సందించింది.
మొదట్లో ఆమె కాస్త వెనకాడినప్పటికీ, అన్న తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనకి తోడు ఇటువంటి గొప్ప అవకాశం మళ్ళీ రాకపోవచ్చుననే ఆలోచనతో వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, కేసీఆర్ మీద నిత్యం తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుండేవారు. కానీ ఆమె ఎంతగా పోరాడినా, కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కనీసం బిఆర్ఎస్ పార్టీ కూడా ఆమెని పట్టించుకోకపోవడంతో తెలంగాణలో వైఎస్ షర్మిల నవ్వులపాలయ్యారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో ఏ సమస్య తీసుకొని పోరాడినా నవ్వులపాలే అయ్యారే తప్ప ఎవరూ ఆమెని నమ్మలేదు. ఉదాహరణకు తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఆమె చాలా పోరాడారు. ప్రతీ మంగళవారం దీక్షలు కూడా చేశారు. కానీ కనీసం నిరుద్యోగులు కూడా ఆమెని పట్టించుకోలేదు.
కానీ అవే సమస్యలపై ఆమె ఏపీలో పోరాటం ప్రారంభించక మునుపే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఆమె ‘ఛలో సచివాలయం’కు పిలుపునిస్తే, పోలీసులు ఆమెను విజయవాడలోని ఆంధ్ర రత్న కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకొని నిర్బందించారు.
ఓ ముఖ్యమంత్రి చెల్లినే పోలీసులు గృహ నిర్బందించడం, ఈ సందర్భంగా ఆమె ‘తన అన్న జగన్మోహన్ రెడ్డి ఓ నియంత, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తి’ అంటూ చేస్తున్న విమర్శలు యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సాక్షాత్ ముఖ్యమంత్రి చెల్లిని గృహ నిర్బంధం చేయడం, రక్షణ కోసం కాంగ్రెస్ కార్యాలయంలో తలదాచుకోవలసి రావడం మీకు (జగన్మోహన్ రెడ్డి) అవమానంగా అనిపించడం లేదా?అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో మూడేళ్ళు కష్టపడినా ఫెయిల్ అయ్యారు. కానీ ఏపీలో ప్రవేశించిన మూడు నెలలు కాక మునుపే నూటికి నూరు మార్కులతో డిస్టింక్షన్‌లో పాస్ అవడం విశేషమే కదా?





