ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల శనివారం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకే కట్టుబడి కడదాక పనిచేశారు. నేను కూడా నా తండ్రి ఆశయాకు, కాంగ్రెస్ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తాను.
దేశంలో రాజ్యాంగానికి విలువ, సెక్యులరిజానికి అర్దం లేకుండాపోయాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీటికి కట్టుబడి పనిచేస్తోంది. కాంగ్రెస్ సిద్దాంతాలతోనే దేశానికి మేలు కలుగుతుందని నమ్మి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా తండ్రి వైఎస్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తాను,” అని అన్నారు.
వైఎస్ షర్మిల రేపు ఉదయం కడప నుంచి విజయవాడ చేరుకుని అక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారు.
జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ, రాష్ట్రంలో ఆయన రచించిన రాజ్యాంగం అమలుకావడం లేదని జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని టిడిపి, జనసేనలు పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా అదే మాట అంటున్నారు. కనుక అప్పుడే ఆమె తొలి పంచ్ వేసిన్నట్లే. రేపు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె జగనన్న గురించి మాట్లాడటం మొదలుపెడతారు. కనుక రేపటి నుంచి ప్రతీరోజూ వైసీపికి సినిమాయే!




