వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను జూన్ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విదించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టునే ఏమార్చడం సాధ్యమేనా?అంటే సాధ్యమే అని నిరూపిస్తున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు!
ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జూలై 3వ తేదీన విచారణ జరిపింది. మళ్ళీ 5వ తేదీన విచారణ జరుపబోతోంది. జూన్ నెలాఖరులోగా కేసు విచారణ ముగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు చేతే రకరకాల సాకులతో వేసిన పిటిషన్లను విచారించేలా చేయడం ఏమార్చడమే కదా?
వివేకా హత్య కేసులో అప్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని కృష్ణారెడ్డి సవాలు చేశారు. బాగానే ఉంది. అయితే ఈ కేసులో తాను కూడా బాధితుడినే తప్ప నిందితుడిని కాదని వాదించారు. తాను బాధితుడుగా దస్తాగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తున్నానని వాదిస్తున్నారు. కనుక ముందుగా తాను బాధితుడా నిందితుడా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ మిసిలీనియస్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తామని అక్కడే తేల్చుకోవలసిందిగా వారు ఆదేశించబోతే సునీతారెడ్డి న్యాయవాదులు అభ్యంతరం చెప్పడంతో మళ్ళీ రేపు (బుదవారం) ఈ కేసు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
అసలు వివేకాను హత్య చేసినవారెవరు?ఎందుకు హత్య చేశారు?అని తేల్చవలసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో కృష్ణారెడ్డి నిందితుడా లేక బాధితుడా?కనుగొనేందుకు విచారణ జరుపుతుండటం గమనిస్తే అసలు కేసు విచారణ ఏవిదంగా పక్కదారి పడుతోందో అర్దం చేసుకోవచ్చు. ఈవిదంగా ఇటువంటి ‘ఉపకేసులతో’ వివేకా హత్య కేసు విచారణ గడువును సుప్రీంకోర్టు చేతే పొడిగించేలా చేయడం మామూలు విషయం కాదు కదా?ఈ లెక్కన వివేకా హత్య కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందంటే ఎవరూ సమాధానం చెప్పలేరు.



