వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేను దాదాపుగా 20 నుండి 30 కోట్లు ఆశ చూపించి, ప్రలోభ పరుచుకుని అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని జగన్ వర్గీయులు చేస్తున్న ఆరోపణలపై నెల్లూరు జిల్లా, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
‘అనివార్య పరిస్థితులలో పార్టీ మారాల్సి వచ్చిందని, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు 20 నుండి 30 కోట్లు ముట్టచెప్తే… ఆ డబ్బులను తీసుకెళ్లేందుకు మినీ లారీలు తెచ్చుకోవాల్సి ఉంటుందని’ కాస్త వెటకారాన్ని పండించారు. ఇప్పటికైనా ‘సాక్షి’ పత్రికలో రాస్తున్న అసత్య కధనాలకు ఫులిస్టాప్ పెట్టాలని, లేని పక్షంలో వైసీపీలో అంతర్గతంగా జరిగిన అనేక విషయాలు బయట పెడతానని జగన్ పార్టీకి అల్టిమేటం జారీ చేసారు సునీల్.
“వైసీపీలో ఉన్న సమయంలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, వాటి గురించి చెబితే ఆ పార్టీనే ఇబ్బంది పడుతుందని” కీలక వ్యాఖ్యలు చేసారు. ‘వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారంలోనే టీడీపీలో చేరే ఆలోచనతో చంద్రబాబుతో మాట్లాడానని, చంద్రబాబు పిలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీ గూటికి వస్తానని ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పుడే సిఎంతో చెప్పినట్లుగా” తెలిపిన సునీల్ కుమార్, ఇతర వైసీపీ నాయకులు కూడా టీడీపీలోకి రావాలని హితవు పలికారు.



