కాపులను కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయం చేసి, లాభం పొందాలని భావించిన వైసీపీ కుటిలయత్నం ఏమైందో రాజకీయ విజ్ఞులకు విదితమే. కాపు రిజర్వేషన్ల పేరుతో వైఎస్ జగన్ వేసిన పాచిక, బూమ్ రాంగ్ కావడంతో, ఇటీవల కాలంలో కాస్త నెమ్మదించిన వైసీపీ మీడియా వర్గాలకు ఈ సోమవారం నాడు “వంగవీటి మోహన రంగా వర్ధంతి” ఆహారంలా దొరికింది. దీంతో జగన్ అండ్ కోకు చెందిన సోషల్ మీడియాలలో ‘వంగవీటి మోహన రంగాను హత్య చేసింది ఎవరు?’ అంటూ విస్తృత ప్రచారానికి తెరలేపారు.
అయితే ఇదేదో రంగా మీద ప్రేమతో చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. వీరందరికీ ఏడాదిలో ఇలా ఓ రెండు రోజులు మాత్రం వంగవీటి మోహన రంగా హత్య అంశం గుర్తుకు వస్తుంది. ఆ రెండు రోజులు జగన్ మీడియా వర్గాలలో అదే హైలైట్ అంశంగా మారుతుంది. అందులో ఒకటి రంగా పుట్టినరోజు కాగా, మరొకటి రంగా వర్ధంతి. ఈ రెండు రోజులలో వంగవీటి మోహన రంగాపై ‘వైసీపీ అండ్ కో’ ఎక్కడలేని ప్రేమ అంతా చూపించేస్తారు. నిజానికి ఇదంతా స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారు అన్న విషయం అభిమానులకు కూడా స్పష్టమైపోవడంతో, వైసీపీని చాలా లైట్ గా తీసుకుంటున్నారు.
నిజానికి నేడు విజయవాడలో చాలా ప్రాంతాలలో రంగా వర్ధంతి సందర్భంగా అన్న దాన కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో ఎక్కువ శాతం రంగా అభిమానులు స్వచ్చంధంగా ఏర్పాటు చేసుకున్నవే తప్ప, పార్టీ పరంగా వైసీపీ చేసినదేమి లేకపోవడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా రంగా తనయుడు రాధా ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ, పార్టీ పరంగా అభిమానులను ఉత్సాహపరిచిన కార్యక్రమలేవి లేవు. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఏడాది రంగా అభిమానులు విజయవాడలో ఇలా స్వచ్చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు.



