వైసీపీ నేతలపై కేసులు, దాంతో వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుండటం, వారి కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తుండటం, వారు విదేశాలకు పారిపోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకొని అప్పగిస్తుండటం, ముందస్తు బెయిల్ వంటి వార్తలే మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కనుక కూటమి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు నమోదు చేయించి రాజకీయకక్ష సాధిస్తోందని వైసీపీలో జగన్ మొదలు గల్లీ స్థాయి నాయకుడు వరకు చెపుతుంటారు.
వారికి అటువంటి అభిప్రాయం లేదా అనుమానమే ఉన్నట్లయితే ‘ఇళ్ళలో నుంచి బయటకు ఈడ్చి కొడతాము.. తలలు నరుకుతాము.. పోలీసుల గుడ్డలూడదీస్తాము..’ వంటి మాటలు మాట్లాడి ఉండకూడదు. కానీ మాట్లాడుతున్నారంటే అధికార పార్టీతో యుద్ధానికి సిద్ధం అనుకుంటున్నట్లే భావించాల్సి ఉంటుంది.
అధికార పార్టీ నేతలని, ప్రభుత్వాన్ని ఈవిదంగా కవ్విస్తూ తమని ఎవరూ టచ్ చేయకూడదని లేదా చేయలేరని వైసీపీ భావిస్తోందా? అంటే కాదని వారే చెప్పుకుంటున్నారు. అయినా ఎందుకు ఇలా కవ్విస్తున్నారు?అంటే ఇదంతా కూడా జగన్ వ్యూహంలో భాగమే కావచ్చు.
ఎన్నికలలో ఘోర పరాజయం పొంది అధికారం కోల్పోయిన వైసీపీ ఇంత తెంపరితనంతో వ్యవహరిస్తుంటే, అధికారంలో ఉన్న టీడీపీ మరింకెంత ధీటుగా స్పందించాలి? కానీ పోలీసుల గుడ్డలూడదీస్తామని జగన్ బెదిరించినా ఆయనపై కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదంటే, టీడీపీ చాలా ఆచితూచి వ్యవహరిస్తోందని అర్దమవుతోంది.
ఇదే వైసీపీకి అలుసుగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం మెతక వైఖరి వలన తాము గట్టిగా రాజకీయాలు చేయలేకపోతున్నామని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లున్నారు. అందుకే జగన్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, అంబటి రాంబాబు ఆవిదంగా మాట్లాడారనుకోవచ్చు.
తద్వారా కూటమి ప్రభుత్వం తమపై చర్యలు తీసుకునేలా కవ్విస్తూ చర్యలు తీసుకునేలా చేయగలిగితే కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని గోల గోల చేయవచ్చు. బహుశః వైసీపీ తాజా వ్యూహం ఇదే కావచ్చు.
వైసీపీ నేతలపై వరుసపెట్టి కేసులు నమోదవుతున్నందున వారి వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. కనుక ఈ విషయంలో వైసీపీకి పూర్తి స్పష్టత ఉంది కానీ కూటమి ప్రభుత్వానికి ఉందా?అనే సందేహం కలుగుతుంది.
కానీ ఈవిదంగా వైసీపీ వెనుక కూటమి ప్రభుత్వం కేసులతో పరిగెడుతుంటే చివరికి ఏమవుతుంది?అని ఆలోచిస్తే ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని అర్దమవుతుంది.
కనుక వైసీపీ నేతలపై కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం పైచేయి సాధిస్తోందా లేక కూటమి ప్రభుత్వం తాము కోరుకొన్నట్లుగా నడుచుకునేలా చేస్తున్న వైసీపీ పైచేయి సాధించిందా? అనే ప్రశ్నకు ఆ రెండు పార్టీలే సమాధానం చెప్పాలి.




