వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల నెల్లూరులో మీడియా సమావేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకొని ఓ కొత్త సమస్య గురించి మాట్లాడారు. చక్కగా చదువుకొని జీవితంలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగవలసిన యువత, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గంజాయికి, దౌర్జన్యాలకు అలవాటుపడి, తమ భవిష్యత్‌ను నాశనం చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనం రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయ దురుదేశ్యంతో చేసిన విమర్శగా వైసీపీ నేతలు కొట్టిపారేయవచ్చు. కానీ ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో పెరిగిన అరాచకాలను చూస్తే ఇది వాస్తవమే అని అర్దమవుతుంది.
ఏ జిల్లాలో చూసిన వైసీపీ నేతల అనుచరులు ప్రతిపక్ష నేతలపైన లేదా వారి వాహనాలపైనా లేదా వారి కార్యాలయాలపైనో దాడులు చేస్తున్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాము. వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. చదువుకొని జీవితంలో రాణించవలసిన యువత చేత కత్తులు, కర్రలు, రాళ్ళు పట్టిస్తున్నదెవరు? అని ఆలోచిస్తే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సహేతుకమని అర్దమవుతాయి. యువత తప్పకుండా రాజకీయాలలోకి రావాలి కానీ ఈవిదంగా కాదు కదా?
తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అందరూ బాగా చదువుకొని జీవితంలో రాణించాలని కోరుకొంటున్నామని సిఎం జగన్ చెపుతుంటారు. కానీ వాస్తవానికి అందుకు భిన్నంగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం చంద్రబాబు నాయుడు కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే దానిపై దాడి చేసిన ధ్వంసం చేసినవారెవరూ?పలు జిల్లాలలో అన్నా క్యాంటీన్లపై, టిడిపి కార్యాలయాలపై దాడి చేసిందెవరు?వైసీపీ కార్యకర్తలే అంటే ఈ రాష్ట్రంలోని యువతే కదా?
ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కనుక వారికి ఎదురుండకపోవచ్చు. కనుక చాలా గొప్పగా అనిపించవచ్చు. కానీ రేపు తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారందరినీ ఉక్కుపాదంతో అణచివేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తుండటం వింటున్నారు కదా?కనుక ఇప్పుడు వైసీపీ నేతల కోసం కర్రలు, కత్తులు పట్టుకొన్న యువత పరిస్థితి అప్పుడు ఏమిటి?
పోలీసు కేసులలో చిక్కుకొంటే వారి భవిష్యత్ ఏమవుతుంది?అంటే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన్నట్లు నాశనం అవుతుందని అర్దమవుతోంది. కనుక యువత ఏదో ఓ పార్టీ కోసం తమ భవిష్యత్‌ను పణంగా పెట్టి జీవితం నాశనం చేసుకోవడం అవసరమా? ఆలోచించాలి.



