పవన్‌ ఋషికొండ పర్యటన ఎఫెక్ట్… అవును అది సచివాలయమే!

Rushikonda Buildingsజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌కు ఎన్ని ఇళ్ళు కావాలి? బెంగళూరులో ఒకటి… హైదరాబాద్‌లో ఒకటి… పులివెందులలో ఒకటి… తాడేపల్లిలో ఒకటి… ఇప్పుడు విశాఖలో మరొకటి… ఒక్క మనిషి కోసం ఇన్ని ఇళ్ళు అవసరమా?ఆయన విలాసంగా జీవించడం కోసం ఋషికొండను చెక్కించేసి దానిపై ఇల్లు కట్టించుకొంటున్నారు. సుప్రీంకోర్టుని, హైకోర్టుని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ని అన్నిటికీ ఋషికొండపై ఎటువంటి అక్రమ కట్టాడాలు నిర్మించడంలేదని అబద్దాలు చెపుతూ ఇన్ని భవనాలు నిర్మించుకొన్నారు,” అంటూ ఇంకా చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు.

అందుకు పవన్‌ కళ్యాణ్‌పై మంత్రులు రోజా తదితరులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది వేరే సంగతి. కానీ పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఋషికొండపై నిర్మించిన భవనాలను చూసి, వాటి ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేయడంతో ఇంకా ఎన్ని పరదాలు కప్పినా, ఎన్ని రేకులు అడ్డంపెట్టినా వాటిని దాచలేమని వైసీపీ గ్రహించిందో లేక ఆయన వాదనలు తప్పని నిరూపించే ప్రయత్నంలో అత్యుత్సాహంతో ట్వీట్‌ చేసిందో తెలీదు కానీ ఋషికొండపై నిర్మిస్తున్న భవనాలు సచివాలయం కోసమే అని వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలోనే ఓ సందేశం పెట్టింది.

ADVERTISEMENT

“ఉత్తరాంద్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్‌… విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించి ఋషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారు. దానిపై కూడా టిడిపి దుష్ప్రచారం చేస్తోంది. ఇది చూస్తుంటే ఉత్తరాంద్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోంది,” అంటూ ట్వీట్‌ చేసింది.

అంటే రాజధాని కేసు తేలేవరకు విశాఖలో రాజధానికి సంబందించి ఎటువంటి పనులు, నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కి పరదాలు కప్పి, రేకులు అడ్డంపెట్టి చకచకా సచివాలయం తదితర భవనాలు నిర్మిస్తోందని స్వయంగా అంగీకరించింది. అంటే ఇంతకాలం సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టిస్తున్నట్లు అర్దమవుతోంది.

సుప్రీంకోర్టుకు ఇది తెలిస్తే కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు తమ ప్రభుత్వంపై చర్యలు తీసుకొంటుందని వైసీపీ గ్రహించిన్నట్లు ఉంది. అందుకే ఈరోజు (ఆదివారం) కొద్ది సేపటి క్రితం వైసీపీ, “మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు,” అని మరో ట్వీట్‌ చేసింది.

అంటే మళ్ళీ బుకాయిస్తోందన్న మాట! టిడిపి దుష్ప్రచారం చేస్తోందని వాదిస్తూ ఋషికొండపై సచివాలయం నిర్మిస్తున్నామని వైసీపీ తనంతట తానుగానే అసలు విషయం బయటపెట్టేసుకొని, ఇప్పుడు పొరపాటున ట్వీట్‌ చేశామంటూ మరో ట్వీట్‌ చేయడం దేనికి? అంటే టిడిపి దుష్ప్రచారం చేస్తోందనే తమ వాదన అబద్దమనా లేక సచివాలయం కడుతూ పర్యాటక భవనాలు కడుతున్నామని చెప్పడం అబద్దామా? నిబద్దత లేని పనులు చేస్తే ఇలాగే దొరికిపోతారు ఎవరైనా అని వైసీపీ మరోసారి నిరూపించుకొంది.

ADVERTISEMENT
Latest Stories