వైసీపీ ఘోర ఓటమి తరువాత గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ, ఆర్థిక పెత్తనం చేసిన రెడ్డి సామాజికవర్గ నేతలు ఒక్కసారిగా కనుమరుగయ్యారు. నాటి నుంచి వైసీపీ ని కాపు కాస్తుంది, జగన్ ను మెప్పిస్తుంది కూడా వైసీపీ పార్టీలోని కాపు నేతలే.
పేర్ని నాని మొదలుకుని అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ వంటి వైసీపీ కీలక కాపు నేతలు వైసీపీ భుజం కాస్తున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ అధినేత వైఎస్ జగన్ నుంచి ‘కాపు టైగర్’ బిరుదు పొందారు.
అలాగే ఆ వివాదం ను అడ్డుపెట్టుకుని వైసీపీ రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు కుల రాజకీయాలు నడిపింది. అంబటి, బాబు ను బూతులతో దూషించడం తప్పు కాదు అంటూ అంబటి నోటి దూలను వెనకేసుకొచ్చిన వైసీపీ అంబటి ఇంటి మీద దాడి ని మాత్రం రాజకీయం చేస్తూ కాపు సమాజం మీద దాడిగా చిత్రీకరించేందుకు సిద్దమయ్యింది.
ఇలా అంబటి వివాదంతో వైసీపీ కొన్ని రోజుల పాటు తన పార్టీ క్యాడర్ ని లైం లైట్ లో ఉంచగలిగింది. ఇక ఆ తరువాత ఆయన బాటలోనే పయనించేందుకు పేర్ని నాని కూడా తనవంతు ప్రయత్నాలు తానూ నిర్వీరంగా కొనసాగిస్తూనే వస్తున్నారు. అందుకోసం ఆయన తన కాపు కార్డు ను వాడుకుంటూ వైసీపీ కి ఎంతోకొంత రాజకీయ మైలేజ్ తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర మహిళా హోమ్ మంత్రి వంగలపూడి అనిత మీద చేసిన మేకప్ కామెంట్స్ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. గుడివాడ కామెంట్స్ మహిళను కించపరిచేలా ఉన్నాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ నుంచి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వరకు వైసీపీ నేతల చర్యలను ఎండగడుతున్నారు.
అయితే గుడివాడ కూడా అంబటి మాదిరే తగ్గేదెలా అంటూ అనిత పై తానూ చేసిన మేకప్ కామెంట్స్ కి కట్టుబడి ఉన్నానంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. మంత్రులు ఎలా పడితే అలా మాట్లాడితే మళ్ళీ ఇదే రీపీట్ అవుతుందంటూ గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని సైతం హెచ్చరిస్తున్నారు.
ఒక మహిళ వస్త్రధారణ, అలంకరణ మీద మాజీ మంత్రులుగా ఉన్న వారు బహిరంగంగా విమర్శలు చేస్తుంటే ఇక వైసీపీ కింద స్థాయి నేతలు ఏ స్థాయికి దిగజారుతారు అనేది వైసీపీ అధిష్టానం గ్రహించడం లేదా.? కాపు నాయకులను తెర ముందుకు తెచ్చి ముఖ్యమంత్రి, మంత్రుల పై ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి ఆ తరువాత టీడీపీ శ్రేణులకొచ్చే బిపీలకు కుల ముద్ర వేయాలని వైసీపీ భావిస్తుందా.?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాపు కుల నాయకులను అణిచివేస్తుందని, వారిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుందని, అయినా కూడా అదే సామాజికవర్గానికి చెందిన పవన్ టీడీపీ రాజకీయ చర్యలను మౌనంగా ప్రోత్సహిస్తున్నారని ప్రచారం చేసి కూటమికి కాపు సామాజికవరాన్ని దూరం చెయ్యాలని వైసీపీ యోచిస్తుందా.? అందుకే వైసీపీ తెరముందు కాపు నేతలను నిలబెడుతూ తెరవెనుక రాజకీయం నడిపిస్తుందా.?




