కోడికత్తితో ఘాటు పెడితే 5 ఏళ్ళు జైలులో మగ్గిపోవలసిందే. దళితులకు గుండు కొట్టించి అవమానిస్తే 18 నెలలు జైలు శిక్ష. కానీ దళితుడుని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆరేడు నెలల్లోనే బెయిల్ లభిస్తుంది. అదే… గొడ్డలితో నరికి చంపేసే వారికి అసలు ఏ శిక్ష ఉండదు!
చిన్న నేరాలకు పెద్ద శిక్షలు. పెద్ద నేరాలకు శిక్షలు లేకపోవడం గమనిస్తే దేశంలో చట్టాలు ఎవరైనా తిరగరాశారా? అనే అనుమానం కలుగక మానదు.
వైసీపి ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి తోట త్రిమూర్తులతో సహా ఆరుగురికి 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ జిల్లా కోర్టు 18 నెలలు జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. అంటే జిల్లా కోర్టులోనే ఈ కేసు విచారణ 28 ఏళ్ళపాటు సాగిందన్న మాట.
వివేకా హత్య కేసు 5 ఏళ్లుగా సాగుతోంది. జగన్ అక్రమస్తుల కేసులు 12 ఏళ్ళుగా సాగుతున్నాయి. ఆ రెండు రికార్డులని తోట త్రిమూర్తుల కేసు ఎప్పుడో బ్రేక్ చేసి 28 ఏళ్ళతో సరికొత్త రికార్డ్ సృష్టించారు. 28 ఏళ్ళపాటు జిల్లా కోర్టులోనే విచారణ సాగించడం మాటలు కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళి అవలీలగా మరో 10 ఏళ్ళు సాగదీసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది కూడా.
అయితే ఇప్పుడు పాయింట్ అది కాదు. న్యాయస్థానం తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినందున ఆయన ఎన్నికలలో పోటీ చేయవచ్చా లేదా?అనేది ప్రశ్న.
రాహుల్ గాంధీ ‘మోడీ’పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడంతో, మోడీ ప్రభుత్వం హడావుడిగా ఆయనపై అనర్హత వేటు వేయించింది.
కానీ వైసీపికి అటువంటి పట్టింపులు, చాదస్తలు ఏమీ లేవు కనుక తోట త్రిమూర్తులునే అభ్యర్ధిగా కొనసాగించవచ్చు. ఎందుకంటే, వైసీపిలో బెయిల్ మీద ఉన్నవారు చాలా మందే ఉన్నారు. అందరూ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, చట్టసభలను కూడా నడిపిస్తున్నారు కూడా.
కానీ తోట త్రిమూర్తులు ముందుగా హైకోర్టులో పిటిషన్ వేసి బెయిల్ పొందాల్సి ఉంటుంది. కానీ ఈ నెల 25తో నామినేషన్స్ గడువు ముగుస్తుంది. కనుక ఆలోగా బెయిల్ సంపాదించుకోవలసి ఉంటుంది. లేకుంటే చేతికి అందిన టికెట్ చేజారిపోతుంది.




