మద్యం కేసులు… ఇలాగే ఉంటాయి!

YSRCP MP Mithun Reddy Released on Bail After 71 Days

మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. అయన గత 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. బయట ఆయన కోసం ఎదురుచూస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

మద్యం కుంభకోణం కేసులన్నీ కొన్నిరోజులు జైలు, బెయిలుతోనే ముగుస్తాయని మొదటి నుంచి అనుకుంటున్నదే. ఎంపీ మిథున్ రెడ్డి విడుదలతో మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో ఎవరు ఎన్ని రోజులు లోపల గడిపారనే లెక్క మాత్రమే మారుతుంటుంది. మిగిలినదంతా సేమ్‌ టూ సేమ్‌. మిథున్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చేశారు కనుక ఈ కేసులో ఆయన కోటా ఇక పూర్తయిందని అనుకోవచ్చు.

ADVERTISEMENT

కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సుమారు ఆరు నెలలు తిహార్ జైల్లో గడిపారు. అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళుతున్నప్పుడే తాను కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తానని పిడికిలి బిగించి చెప్పారు. ఎలాగో వచ్చినా బయటకు వచ్చేశారు కనుక కడిగిన ఆణి ముత్యం కిందే లెక్క. ఆమె బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు ‘న్యాయం ధర్మం గెలిచాయని’ స్పష్టం చేశారు.

ఆ ఫార్ములా ప్రకారం చూస్తే మిథున్ రెడ్డి కూడా కడిగిన ఆణిముత్యంలా బయటకు వచ్చారు. కనుక ఆయనతో సహా వైసీపీ నేతలు కూడా నిరభ్యంతరంగా ‘న్యాయం, ధర్మం గెలిచాయని’ చెప్పుకోవచ్చు.

ఎందుకంటే జైలు కోటా పూర్తయిపోయింది కనుక ఒకవేళ ఈ కేసులో మళ్ళీ కదలికలు ఏర్పడినా ‘కోర్టు సీన్లు’ మాత్రమే ఉంటాయి తప్ప మళ్ళీ అరెస్టులు, జైలు, శిక్షలు వంటివేవీ ఉండవు.

కనుక వేలకోట్ల కుంభకోణం జరిగిందని… ఫలానా నాయకుడుపై కేసు నమోదు అయ్యింది.. విచారణకు పిలిచారు… అరెస్ట్‌ చేశారు… జైల్లో పెట్టారు… వంటి వార్తలు చదివి సామాన్య ప్రజలు అనవసరంగా చాలా ఆవేశ పడుతుంటారు. కానీ ఎన్ని వేలకోట్లు… ఎంత పెద్ద కుంభకోణం స్టోరీ అయినా చివరికి కధ ఇలాగే ముగుస్తుంటుంది. అని తెలుసుకున్నా కూడా చాలా మందికి జ్ఞానోదయం అవదు. మళ్ళీ ఇలాంటి వార్త చూడగానే ఆవేశపడిపోతుంటారు. వారి అమాయకత్వం వలన ఆవేశపడితే దానికి ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు బాధ్యులంటే ఎలా?

ADVERTISEMENT
Latest Stories