former-ttd-chairman-bhumana-karunakar-reddy

కూటమి పార్టీల మద్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని నేటికీ వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య జరుగుతున్న ఈ ఆధిపత్యపోరుతో సామాన్య ప్రజలకు ఎటువంటి సంబందమూ లేదు.

Also Read – విజయవాడలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి… పలకరింపులు వరకే!

కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారు, తిరుమల విషయంలో వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుండటం క్షమించరాని నేరం.

వైసీపీ హయంలో తిరుమలలో అనేక అపచారాలు చేసినందునే ఎన్నికలలో ఆ పార్టీ అంత ఘోర పరాజయం పాలైందని నమ్మే భక్తులు కోకొల్లలున్నారు.

Also Read – సైన్యానికి పూర్తి స్వేచ్ఛ…దేనికి సంకేతం..?

వైసీపీ హయంలో పరమ పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం సిఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టినప్పుడు యావత్ దేశ ప్రజలు నిర్ఘాంతపోయారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జగన్‌, వైసీపీ నేతలు ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా చంద్రబాబు నాయుడుపైనే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులను కూటమి ప్రభుత్వం శిక్షించలేకపోయినా, వారికి ఆ భగవంతుడు నుంచి తప్పించుకోలేరు.

కానీ వైసీపీకి ఇటువంటి భయాలు, సెంటిమెంట్స్ ఏవీ లేనందున నేటికీ తిరుమల గోశాల ఆవులు చనిపోతున్నాయంటూ పేరుతో నీచ రాజకీయాలు చేస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వంపై బురద జల్లి, అప్రదిష్ట పాలుజేసేందుకు తిరుమల ప్రతిష్టని దెబ్బ తీయడానికి కూడా వెనకాడకపోవడం, అదీ.. టీటీడీ మాజీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమాన కరుణాకర్ రెడ్డి చేస్తుండటం చాలా దారుణం.

Also Read – వైసీపీ రాజకీయం: కాదేది అనర్హం…

ఆయన ఆరోపణలను టీటీడీ ఖండిస్తున్నప్పటికీ ఆయన వాటిని పునరుద్ఘాటిస్తుండటమే కాక వాటికి తాను కట్టుబడి ఉన్నానని చెపుతున్నారు. టీటీడీ ఛైర్మన్‌, ఈవోలను తక్షణం ఆ పడవులలో నుంచి తొలగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

భూమాన ఆరోపణలతో తిరుమల ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి. కనుక వాటిని ఖండించి ఎదురుదాడి చేయడం, వైసీపీ హయంలో తిరుమలలో జరిగిన అపచారాలను బయటపెట్టడం దీనికి ఎంతమాత్రం పరిష్కారం కాదనే విషయం టీటీడీ గ్రహిస్తే మంచిది.

గోశాలలో ఆవులు చనిపోవడం అబద్దమని టీటీడీ చెపుతోంది. చనిపోతున్నాయని భూమన వాదిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ పోలీసుల చేత విచారణ జరిపించి నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలి.

ఒకవేళ గోశాల పేరుతో తిరుమల ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లయితే ఆయనపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే ఇలాగే తిరుమల పేరుతో ఎవరో ఒకరు నీచ రాజకీయాలు చేస్తూనే ఉంటారు.




స్వామివారి భక్తుల విరాళాలతోనే తిరుమల నిర్వహణ జరుగుతోంది. కనుక నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా?