రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఉన్న ఒక పెద్ద మాస్ లీడర్ జగన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే తనకున్న ఆ మాస్ ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి, పెంచుకోవడానికి జగన్ చేస్తున్న బలప్రదర్శన యాత్రలు జగన్ ను ఒకవర్గం ప్రజలకు దూరం చేస్తున్నాయా.?
ప్రభుత్వ ఉచిత పథకాలు కాదు ప్రభుత్వం చేసే అభివృద్దే తమకు ముఖ్యం అనుకునే ఓటర్లను వైసీపీ పూర్తిగా విస్మరిస్తుందా.? రాజధాని తో పనిలేదు, రోడ్ల నిర్మాణాలు అవసరం లేదు, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అక్కరలేదు కేవలం అప్పులు చేసి సంక్షేమ పథకాల రూపంలో ఉచితాలు డోర్ డెలివరీ చేస్తే చాలు అనుకుంటున్న జగన్ ప్రగతికి పట్టం కట్టే ఓటర్లను తక్కువ అంచనా వేశారు.
దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. 2024 ఎన్నికలలో వైసీపీ 11 సీట్లతో ఘోర ఓటమిని మూటకట్టుకున్నప్పటికీ తన పార్టీకి 40% ఓట్ బ్యాంకు తెచ్చుకోవడంలో విజయం సాధించగలిగింది. అయితే ఆ ఓట్ బ్యాంకు ను మరో 5 % పెంచుకోగలిగితే వైసీపీ జగన్ 2.0 కలను సాకారం చేసుకోగలదు అనే ఆలోచనలోనే ముందు ఉన్న 40% ఓట్ బ్యాంకు ను కాపాడుకునేందుకు ప్రజలలో జగన్ మీదున్న ప్రేమ, నమ్మకం తగ్గలేదు,
వైసీపీ కున్న రాజకీయ బలం సుస్థిరంగా ఉందని నిరూపించేందుకే జగన్ పర్యటనలు బలప్రదర్శన ఈవెంట్లు గా మారుతున్నాయా.? నాడు వై నాట్ 175 అన్న నినాదమే వైసీపీ ని 11 కి పరిమితం చేస్తే నేడు వైసీపీ చేస్తున్న రప్ప రప్ప నినాదాలు వైసీపీ 2.0 కలను నిజం చేస్తుందా.?
జగన్ తనకున్న ఆ 40% ఓట్ బ్యాంకు ను కాపాడేందుకు చేస్తున్న బలప్రదర్శనలు, రప్ప రప్ప నినాదాలు గెలుపు కు, అధికార పీఠానికి కావాల్సిన ఆ మిగిలిన ఓట్ పర్శంట్ ను వైసీపీ కి పూర్తిగా దూరం చేస్తున్నాయి అనేది వైసీపీ ఇప్పటికి గ్రహించలేకపోతుంది.
ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా అమరావతి రూపాంతరం చెందుతుంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం తో అమరావతిని ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇక భోగాపురం ఎయిర్ ఫోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర రూపు రేకలకు కొత్త రెక్కలు వచ్చాయి. ఇటు శ్రీ సిటీ లో పారిశ్రామిక రంగం అభివృద్ధి పదంలో ముందుకెళుతోంది.
ఇక విశాఖ TCS, కాగ్నిజెంట్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఐటీ హబ్ గా రూపం మార్చుకుంటుంది. ఇంతటి అభివృద్ధి కళ్ళ ముందుకనిపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీ రప్ప రప్ప రాజకీయాల వైపు ఆకర్షితులవుతారా.? వైసీపీ 2024 ఎన్నికల ఫలితాలలో తన పార్టీకొచ్చిన సీట్ల సంఖ్యను పక్కన పెట్టి 40% ఓట్ షేర్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 2029 ఎన్నికల కోసం ఆ పర్శంటేజ్ లెక్కల రాజకీయం మొదలుపెట్టిందా.?




