సర్వే అట… జంపింగ్ ఎమ్మెల్యేల స్థానాలలో వైసీపీనే గెలుస్తుందట..!

YSRC, YSR Congress Party, YSR Congress survey, YSR Congress secret survey, YS Jagan Mohan Reddy, Andhra Pradesh Politics|తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలతో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసారు. అయితే వీరందరినీ రాజీనామా చేసి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సిందిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత కొన్నాళ్ళుగా చెప్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంత గట్టిగా జగన్ ఎందుకు చెప్తున్నారు అని అంటే… తానూ నిర్వహించిన ఓ సర్వేలో వైసీపీ దాదాపుగా అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందట.

లేటెస్ట్ గా జంప్ అయిన ఎమ్మెల్యే అమరనాధ్ రెడ్డి నియోజక వర్గం పలమనేరు మినహాయిస్తే… మిగిలిన 19 శాసనసభ నియోజక వర్గాల్లో మరియు గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంతో పాటు, టిడిపి లెజిస్లేటర్ అనిత నియోజకవర్గంలోనూ వైసీపీ అధినేత ఒక ప్రైవేటు సర్వే నిర్వహించారట. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీతో నిర్వహించిన ఈ సర్వేలో ఏకంగా 18 స్థానాలలో జగన్ పార్టీ విజయబావుట ఎగురవేస్తుందని తేలిందట.

ADVERTISEMENT

అసలు ట్విస్ట్ ఏమిటంటే… భూమా కుటుంబానికి కంచుకోటగా భావించే ఆళ్లగడ్డ, నంద్యాలలో జగన్ పార్టీ తన సత్తా చాటుతుందట. బహుశా ఈ సర్వే వివరాలు జగన్ కైనా తెలుసో లేదో గానీ, జగన్ పై అమితమైన ప్రేమను కురిపించే మీడియా ‘గోబెల్స్’ ప్రచారం చేస్తూ పండగ చేసుకుంటోంది. అయితే వాస్తవ పరిస్థితులను విశ్లేషణ చేసుకుంటే… ఈ సర్వేలో ఎంత (అ)‘వాస్తవం’ ఉందో ఇట్టే పసిగట్టవచ్చు. దీంతో వైసీపీ వర్గపు మీడియాలకు అసత్యపు ప్రచారాలు చేయడం మినహా వాస్తవాలను వెల్లడించరని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ సర్వే ప్రకారం… భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, ఆదినారాయణరెడ్డి, అమరనాధ్ రెడ్డి వంటి కీలక నేతలు కూడా పరాజయం పాలవుతారట. పాపం… ఆ ఒకట్రెండు నియోజకవర్గాలు ఎవరికీ కేటాయించారో గానీ, ‘క్లీన్ స్వీప్’ చేయకుండా వదిలేసారు అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సర్వే పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నారు.

సీక్రెట్ సర్వేలు రాజకీయ నాయకులు చేయించుకోవడం సర్వ సాధారణమే. తమకు అనుకూలంగా వచ్చిన సమయంలో ఈ సీక్రెట్ సర్వేలను మీడియా ముఖంగా బట్టబయలు చేస్తారు, అదే ఫలితాలు ప్రతికూలంగా ఉంటే మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మరి ఇక్కడేమో ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పటికీ, మీడియా ముఖంగా తెలియజేయకపోవడం వెనుక ‘మతలబు’ ఏమిటి? ఇదే సీక్రెట్ సర్వేను బయటపెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని మరింత ఒత్తిడిలో నెట్టవచ్చు కదా?

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని జగన్, తమకు అనుకూలంగా వచ్చిన ఈ సర్వేను బయటపెట్టకుండా ఉంటారా? ఒకవేళ అలా ఉన్నారు అంటే… అక్కడే కదా అసలు ‘లాజిక్’ దాగి ఉంది. మరి అలాంటి సర్వే జరిగిందంటారా? ఏమో… జగన్ ను నెత్తికెత్తుకున్న వారికే తెలియాలి..!

ADVERTISEMENT
Latest Stories